కాదేదీ వాడుకోడానికి అనర్హమని చంద్రబాబు బలంగా నమ్ముతారు. తెలివి తేటలుండాలే గానీ, చందమామ మొదలుకుని ఎవరినైనా, దేన్నైనా రాజకీయ స్వార్థానికి వాడుకోవచ్చని చంద్రబాబు మరోసారి నిరూపించారు. చంద్రయాన్-3 విజయవంతం కావడాన్ని చంద్రబాబు టీమ్ ఎలా వాడేసుకుందో రెండురోజుల క్రితం ఎల్లో మీడియాలో అందరూ చూశారు. కరివేపాకులా ఎదుటి వాళ్లను వాడుకోవడంపై చంద్రబాబు పేటెంట్స్ ఉన్నాయనే విమర్శ లేకపోలేదు.
తాజాగా టాలీవుడ్ స్టైలిష్ హీరో, ఇటీవల జాతీయ అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ను ఆయనతో సంబంధం లేకుండా చంద్రబాబు బాగా వాడేసుకున్నాడు. అల్లు అర్జున్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. రానున్న ఎన్నికల్లో వారిని టీడీపీ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆయన గురించి ప్రస్తావించారు. పనిలో పనిగా తన గొప్పతనాన్ని తానే చెప్పుకున్నారు.
పుష్ప సినిమాలో తన ఫొటో పెట్టారని వైసీపీ వాళ్లు తెగ ఏడుస్తున్నట్టు చంద్రబాబు మీడియాతో అన్నారు. పుష్ప సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్లో తన ఫొటో వుందని, ఆ సినిమా తీసిన కాలంలో తాను సీఎంగా ఉన్నానో లేక ఎర్రచందనం స్మగ్లర్లను కంట్రోల్ కంట్రోల్ చేశాననో వారు తన ఫొటో వాడారని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. తన ఫొటో సినిమాలో వాడినందుకు వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని విమర్శించడం ద్వారా అల్లు అర్జున్ అభిమానుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత, తనపై సానుకూల వైఖరితో వుండాలనే ఎత్తుగడ ఆయన మాటల్లో కనిపించింది.
ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో విడుదలైన సినిమాలో తన ఫొటో గురించి బాబు ఇప్పుడు చెప్పడం వెనుక ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా స్లైలిష్ హీరోని కూడా బాబు వాడేసుకున్నారన్న మాట.