టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరడం లేదు. సుదీర్ఘకాలంగా ఐపీఎల్ ఆడుతూ.. ఇప్పటి వరకూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా విజేతగా నిలవని జట్టులో సభ్యుడి కాని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విరాట్ కొహ్లీ మాత్రమేనేమో!
భారత, విదేశీ స్టార్ క్రికెటర్లు చాలా మంది ఏదో ఒక సీజన్లో అయినా విజేతలుగా నిలిచి ఉండనే ఉంటారు. అయితే కొహ్లీకి మాత్రం ఆ డ్రీమ్ నెరవేరలేదు. ఇక ముందు ఏమో కానీ.. కెప్టెన్ గా కొహ్లీ ఐపీఎల్ ట్రోఫీ అందుకోకుండానే తప్పుకుంటున్నాడు!
ఈ సీజన్ ఐపీఎల్ తర్వాత తను ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించబోనంటూ ఇది వరకే కొహ్లీ ప్రకటించాడు. ఇక ఎలిమినేషన్ మ్యాచ్ లో ఓటమిపాలు కావడంతో ఈ సీజన్లో ఆర్సీబీ ఆట ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగని మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలై ఎలిమినేటర్ లెవల్ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ఆఖరి మ్యాచ్ ఆడేసినట్టే!
దీంతో దాదాపు దశాబ్దకాలం పాటు కెప్టెన్ గా వ్యవహరించి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన జట్టును విజేతగా నిలపని కెప్టెన్ గా కొహ్లీ నిలుస్తున్నాడు. 2011 నుంచి ఆర్సీబీ జట్టుకు కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టులో సభ్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకూ ఆర్సీబీ ఎప్పుడూ ఐపీఎల్ విజేతగా నిలిచిన చరిత్ర లేదు. గత సీజన్లో విజేతగా నిలుస్తుందనే ఊపు కనిపించింది. ఈ సారి కూడా ఆ జట్టు ఆరంభంలో అదరగొట్టింది. అయితే ఎలిమినేటర్ లెవల్లో ఖేల్ ఖతం అయ్యింది.
కొహ్లీ కెప్టెన్సీలో 2016లో ఐపీఎల్ ఫైనల్ వరకూ చేరింది ఆర్సీబీ. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన భారీ స్కోరును చేజ్ చేసే క్రమంలో కొహ్లీ సేన తడబడింది. అలా ఐపీఎల్ ట్రోఫీ డ్రీమ్ నెరవేరలేదు. ఇక బెంగళూరు జట్టుకు దీర్ఘకాలంగా కెప్టెన్ గా వ్యవహరిస్తూ కనీసం ఒక్కసారి కూడా ఆ జట్టును విజేతగా నిలపలేకపోవడంపై కొహ్లీ ఇది వరకే విమర్శలను ఎదుర్కొన్నాడు.
కొహ్లీని టార్గెట్ గా చేసుకునే మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంలో ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. ఐపీఎల్ జట్టును విజేతగా నిలపలేని కొహ్లీని జాతీయ జట్టు కెప్టెన్ గా ఎలా కొనసాగిస్తారంటూ వారు విమర్శలను చేశారు. చివరకు కొహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే సమయం వచ్చింది. ఇప్పటికే టీమిండియా టీ20 ప్రపంచకప్ కెప్టెన్సీ నుంచి కొహ్లీ తప్పుకోనున్నట్టుగా ప్రకటించేశాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత కొహ్లీ తప్పుకోనున్నాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్సీకి కూడా ఈ సీజనే లాస్ట్ అన్నాడు.
ఈ సీజన్లో కూడా ట్రోఫీని నెగ్గలేకపోతోంది ఆ జట్టు. ఆటగాడిగా ఎంత పేరెన్నిక గన్నా కెప్టెన్ గా పేరున్న ట్రోఫీలను నెగ్గడంలో మాత్రం కొహ్లీది ఫెయిల్యూర్ స్టోరీగానే మిగిలిపోతోందిలా!