అమరావతి నుంచి రాజధానిని ఎక్కడికీ తరలించలేరని, తాను అడ్డుకుంటానని ప్రతినబూనిన జనసేనాని పవన్‌కల్యాణ్ … ఎప్పట్లాగే చివరికి చేతులెత్తేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ పోరాటానికి సమయం ఆసన్నమైందనే సాకుతో క్షేత్రస్థాయి పోరాటానికి వకీల్‌సాబ్ రాంరాం చెప్పారంటున్నారు. ఇందుకు తాజాగా జనసేన విడుదల చేసిన ప్రకటనే నిదర్శనమని చెబుతున్నారు.
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మూడు గంటలకు పైగా సమావేశమైంది. పార్టీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పలు కీలక అంశాలున్నాయి. మరోసారి చంద్రబాబుపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని సమస్యకు మూలకారణం చంద్రబాబే అని మరోసారి పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
“గతంలోనే మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించింది. ఆనాడు మా పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలి. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్య లోనే ఆపివేయడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు” అని జనసేనాని పవన్‌కల్యాణ్ మండిపడ్డారు.
పవన్‌కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే…
“ఏపి రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి సమయం వచ్చింది. మూడు రాజధానులన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిద్దామంటే కోవిడ్ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో అమరావతినే రాజధానిగా కొనసాగించేందుకు న్యాయ పోరాటం చేసేందుకు సమయం ఆసన్నమైంది” అని జనసేన అభిప్రాయపడింది.
జనసేన వెల్లడించినట్టు పైన పేర్కొన్న అభిప్రాయమే ఇకపై ప్రత్యక్ష పోరాటానికి ఆ పార్టీ గుడ్‌బై చెప్పినట్టు అర్థమవుతోంది. దీనికి కోవిడ్ కారణంగా ఆ పార్టీ చూపుతోంది. నిజానికి కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో గుంపులుగా కలవడం కూడా సమస్యను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. అంతేకాదు, రాజధాని బిల్లులు గవర్నర్ ఆమోదం పొందడం, ప్రజల నుంచి అమరావతి రాజధానికి పెద్దగా మద్దతు రాని నేపథ్యంలో కూడా జనసేన ఇలాంటి నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.