ఒకవైపు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటూ పెద్దపెద్ద బిరుదులిచ్చి.. ఎన్టీఆర్ ను కమ్మవాడిగా తాము ఓన్ చేసుకోవాలి, సత్యా నాదెళ్ల తమ కులపోడే అని స్వయంతృప్తి పొందాలి, కమ్మ వాళ్లు రక్తదానం చేయొద్దని, వేరే కులపోళ్లకు రక్తమిస్తే వాళ్లకూ తమ గొప్పదనం అంటుకుపోతుందని కుల సభల్లో ప్రకటించుకోవాలి, కమ్మవాడు కాబట్టే రాజమౌళి బాహుబలి సినిమా తీశాడని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి చంకలు గుద్దుకోవాలి.. ఇలాంటి లేకి పనులు, కుల గజ్జి పతాక స్థాయికి చేరిన పనులు కమ్మ వాళ్లు మాత్రమే చేయాలి!
అదే సరిహద్దులో ప్రాణాలు అర్పించిన సైనికుడు తమ కులస్తుడని ఆర్యవైశ్యులు చెప్పుకోరాదు, సోనూ సూద్ తమ కులం వాడని చేనేత సామాజికవర్గం వాళ్లు చెప్పుకోకూడదు.. ఏదైనా కులం గురించి మాట్లాడాలంటే, కులపు జాతీయ గీతాలు రాసుకోవాలంటే అది కమ్మ వాళ్లు మాత్రమే చేయాలి, వేరే వాళ్లు చేస్తే అది సంకుచిత స్వభావం.. ఇలా బాధపడిపోతున్నది మరెవరో కాదు, శ్రీమాన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. తన వారాంతపు కామెంట్ లో ఆయన జనాల్లో ప్రబలుతున్న కుల పిచ్చి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
కులపిచ్చి గురించి రాధాకృష్ణ చెప్పడం అంటే, కొంతమందికి అదెలాంటి ఫీలింగ్ కలుగుతుందో వివరించి చెప్పనక్కర్లేదు. గాల్వాన్ లోయలో మరణించిన సంతోష్ కుమార్ ను కోమట్లు ఓన్ చేసుకుంటున్నారని, సోనూ సూద్ ను సాలెవాళ్లు ఓన్ చేసుకుంటున్నారని ఆయన తెగ ఫీలయిపోయారు. ఇది తెలుగునాట కొత్తది కాదు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఏపీలోని మారుమూల గ్రామాల్లోని గాండ్ల కులస్తులు ఫ్లెక్సీలు వేయించుకున్నారు. తమ కులస్తుడు ప్రధాని అయ్యాడని వారు గర్వపడ్డారు.
ఏకంగా.. ఆ మధ్య ఏదో జాతీయ గీతంలా కులగీతం కూడా రూపొందించుకున్న ఘనత ఎవరిదబ్బా? ఎన్టీఆర్ ను జస్ట్ ఒక కమ్మ కుల ప్రముఖుడిగా దించిన ఘనత ఎవరిది?! కమ్మవాళ్లు కావడం చేతే సత్యా నాదెళ్ల, రాజమౌళి లాంటి వాళ్లు ఆయా రంగాల్లో రాణించారని వారి వ్యక్తిగత ప్రతిభను కించపరిచిన ఘనత ఎవరదబ్బా? ఆర్యవైశ్యులు, పద్మశాలీలు ఏవో చిన్న పోలికలు పెడితేనే రాధాకృష్ణకు బాగా పొడుచుకొచ్చింది. అది కూడా మరణించిన సైనికుడి విషయంలో సానుభూతి అది. వారిది సంకుచిత స్వభావం అనిపించింది. నల్ల గురివింద తమ నలుపెరగనట్టుగా రాధాకృష్ణ కుల సంకుచిత స్వభావం గురించి మాట్లాడటం విడ్డూరం. ఆ మధ్య సొంత చానళ్లో మోహన్ బాబు రాధాకృష్ణకు కుల గజ్జి అని, కుల తామర అని వ్యాఖ్యానించిన సంగతి ఈ సందర్భంలో గుర్తుకు వస్తే తప్పు గుర్తుకు తెచ్చుకున్న వాళ్లది కాదేమో!