ఎన్నిక‌ల వేడి ప్ర‌తిబంధ‌కంగా మారిన ఎండ‌లు!

ఎండ‌లు మండిపోతున్నాయి. అంత‌టా ఇదే మాట‌. ఊరూవాడా తేడా లేకుండా.. అన్ని చోట్లా ప్ర‌జ‌లు మండే ఎండ‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతం కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ప్ర‌త్యేకించి నీటి వ‌న‌రుల స్థాయి…

ఎండ‌లు మండిపోతున్నాయి. అంత‌టా ఇదే మాట‌. ఊరూవాడా తేడా లేకుండా.. అన్ని చోట్లా ప్ర‌జ‌లు మండే ఎండ‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతం కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ప్ర‌త్యేకించి నీటి వ‌న‌రుల స్థాయి త‌క్కువగా ఉన్న ప్రాంతం కావ‌డంతో ఎండ‌ల ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌. 

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా చోట్ల ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 43 డిగ్రీల‌ను దాటేశాయి! అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాలు స‌రిహ‌ద్దును పంచుకునే ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌తాక స్థాయికి చేరాయి. రాతి నేల ఎక్కువ‌గా ఉండే ఆ ప్రాంతాలు అటు పై నుంచి ఇటు కింద నుంచి సెగ‌లు కక్కుతున్నాయి. ఈ తీవ్ర‌మైన ఎండ‌లు మిగ‌తా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అన్ని చోట్లా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క‌నీసం 40 డిగ్రీల‌ను దాటేశాయి.

ఈ ఎండ‌ల మ‌ధ్య‌న రాజ‌కీయ వాతావ‌ర‌ణం అయితే వేడెక్కింది. తిరుప‌తి ఉప ఎన్నిక పోరుతో.. రాయ‌ల‌సీమ రాజ‌కీయం మ‌రింత హాట్ గా మారింది. ఇప్ప‌టికే అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తూ  ఉన్నారు. అయితే.. ఇక్క‌డ అన్ని పార్టీల‌కూ పెద్ద మైన‌స్ పాయింట్ ఒక‌టి ఉంది. అదే మండే ఎండ‌లు.

రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు అయితే ఎలాగో క‌ష్ట‌ప‌డి ఎండ‌ల‌కు వెర‌వ‌క ప్ర‌చారంలో పాల్గొంటున్నారు కానీ, సామాన్య ప్ర‌జ‌ల‌ను మాత్రం ఎన్నిక‌ల ప్ర‌క్రియ వైపు చూడ‌నివ్వ‌డం లేదు మండే ఎండ‌లు.

ప్ర‌చార ప‌ర్వంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల హ‌డావుడే కానీ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం మాత్రం అంతంత మాత్ర‌మే. ఎండ‌ల‌కు త‌ట్టుకుని ఈ హ‌డావుడిలో ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఎన్నిక‌లు వ‌స్తే.. ఆ హ‌డావుడే వేరు. 

కానీ మండుటెండ‌ల మ‌ధ్య‌న మాత్రం ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల హ‌డావుడిలో పాలుపంచుకునే ప‌రిస్థితి లేదు. దానికి తోడు కోవిడ్ భ‌యాలు కూడా ఎన్నిక‌ల సందడిని త‌గ్గించి చేస్తూ ఉన్నాయి. మ‌రి ఈ ప్ర‌భావాలు పోలింగ్ మీద ప‌డ‌కుండా మంచి శాతంలో పోలింగ్ న‌మోదైతే.. ఉప ఎన్నిక ప్ర‌క్రియ స‌జావుగా సాగిన‌ట్టే.