తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మతం అంశాన్నే గట్టిగా నమ్ముకున్న వైనం స్పష్టం అవుతోంది. ఈ మధ్యనే ఒక టీవీ చానల్ షో లో చెప్పు దెబ్బలు తిన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా తిరుపతి ఉప ఎన్నికను మతం పోరుగానే అభివర్ణించిన ట్వీట్ వైరల్ గా మారింది.
తిరుపతి ఉప ఎన్నిక హిందువులకూ, హిందూ ద్రోహులకు మధ్యన పోరాటం గా అభివర్ణించారు విష్ణు. ఏ ఉత్తరప్రదేశ్ లోనో ఇలాంటి మాటలు మాట్లాడితే పోలోమని ఓట్లు పడతాయేమో కానీ, ప్రశాంతతకు కేరాఫ్ అయిన తిరుపతిలో ఈ మతం మంటలు ఎంత వరకూ ప్రయోజనాన్ని కలిగిస్తాయో బీజేపీ నేతలకే తెలియాలి.
ఒకటైతే స్పష్టం అవుతున్న అంశం.. తాము మునిగినా, తేలినా మతం అంశంతోనే అని బీజేపీ నేతలు ఫిక్సయ్యారు. జనాలు అసహ్యించుకున్నా, తిట్టుకున్నా, తిరస్కరించినా.. వారి చేతిలోని ఆయుధం మాత్రం మతమే. ఒకవైపు తిరుపతి ఉప ఎన్నిక వేళ ప్రజల మధ్యన అనేక రకాల చర్చ జరుగుతూ ఉంది.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన మోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఆపై.. ధరల పెరుగుదల, మోడీ వైఫల్యాలు.. ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చలే. అయితే వాటన్నింటినీ పక్కదారి పట్టించడానికి బీజేపీ మతం అనే ఆయుధాన్ని వాడటానికి కట్టుబడినట్టుగా ఉంది.
కేవలం ఏపీ బీజేపీ వీర హిందుత్వ వాదులే కాదట.. తెలంగాణలో ఈ తరహా ప్రసంగాలను చేస్తూ రాజకీయ ప్రయోజనాలను పొందడంలో నిపుణుడుగా పేరు తెచ్చుకున్న అక్కడి బీజేపీ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ వంటి వారు కూడా తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తారట. వారు అక్కడకు వెళ్తున్నారంటేనే.. రెచ్చగొట్టే ప్రసంగాలకు లోటు లేదని స్పష్టం అవుతోంది.
మరి అసలు విషయాలను పక్కనకు నెట్టి.. మతం మాటలతో బీజేపీ ఎంత వరకూ ప్రయోజనం పొందుతుంది? అనేది ప్రస్తుతానికి శేష ప్రశ్న. అయితే కమలం పార్టీ లెక్కలు మాత్రం వచ్చిన కాడికి లాభం అన్నట్టుగా ఉండొచ్చు. వాళ్ల అజెండా తిరుపతి పోరుతో మొదలూ కాదు, తుదీ కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎన్నికలు జరిగినా.. కమలం పార్టీ నేతలకు చెప్పుకోవడానికి మతం మంటలు తప్ప మరో ఆయుధం లేకపోవచ్చు!