ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను సీబీఐ విచారించడం తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగంగా చేస్తున్నదే అని బీజేపీ వ్యతిరేక పార్టీలు విమర్శిస్తున్నాయి. అలాంటి విమర్శలను బీజేపీ తిప్పి కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కవితను ఆమె ఇంట్లోనే సీబీఐ విచారణ చేస్తోంది. న్యాయవాది సమక్షంలో ఆమె నుంచి సీబీఐ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన డిమాండ్ చేశారు. కవితను సీబీఐ చేస్తున్న విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కాలంలో విచారణలను లైవ్ ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టే లైవ్ ఇస్తున్నప్పుడు, సీబీఐ మాత్రం ఎందుకు గోప్యంగా విచారణ జరుపుతోందని ఆయన డిమాండ్ చేశారు.
సీబీఐ తమ విచారణలను లైవ్ ఇవ్వడం వల్ల జనానికి వాస్తవాలు తెలుస్తాయన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి అనుకూలమైన వారి విషయంలో ఏ స్థాయి దొంగలైనా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీకి రాజకీయంగా వ్యతిరేకంగా నడుస్తున్న వారిపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తూ, లొంగదీసుకునేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు, కేసులు రాజకీయంగా పక్షపాత వైఖరితో సాగుతుండడం వల్ల ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కవితపై విచారణ కూడా రాజకీయ దాడిగా ఆయన అభివర్ణించారు.