సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. వాళ్ల సంగతి ప్రజలే తేల్చుకుంటారు. అయితే సగంసగం రాజకీయం చేసే సినిమా వాళ్లతోనే వివాదాలు! ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ముందుకు వెళ్లే నటీనటుల పెట్టుబడి కూడా వాల్లు చేసిన సినిమాలే! తాము సినిమాల ద్వారా సంపాదించుకున్న పేరును, కీర్తిని ఉపయోగించుకుని వీళ్లు రాజకీయాల్లో ట్రై చేస్తూ ఉంటారు.
రాజకీయాల్లో పదవులను పొందడానికి లేదా, ప్రజా సేవ చేయడానికి సినిమాలు ఏ రకంగానూ అర్హత కాదు! అయితే.. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును వీరు క్యాష్ చేసుకుంటూ ఉంటారనేది బహిరంగ రహస్యమే. సినిమాల కన్నా రాజకీయాలు మోర్ గ్లామరస్ గా కనిపించడంతో అనేక మంది నటీనటులు ఈ అడుగులు వేశారు, వేస్తూ ఉన్నారు, వేస్తూనే ఉన్నారు!
భారతీయ ప్రజాస్వామ్యంలో ఏ రకమైన వ్యక్తిగత అర్హత లేకపోయినా పొందడానికి అవకాశం ఉన్న హోదాలు కేవలం రాజకీయ పదవులు మాత్రమే! కాబట్టి.. సినిమా వాళ్ల ఆటలు కూడా చెల్లుబాటు అవుతూ ఉన్నాయి. రాత్రికి రాత్రి పార్టీలు పెట్టి, ఎన్నికల ముందు నెలల కాల్షీట్లను వాడుకుని వాళ్లు రాజకీయ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ ప్యాకప్! మళ్లీ సినిమాలు.
ఈ విషయంలో పెద్ద పెద్ద హీరోలు, చోటామోటా నటులు తమ తమ అవకాశవాదాలను యధేచ్ఛగా ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్లకు సరిగ్గా ఎన్నికలకు నెలల ముందు మాత్రమే రాజకీయం, ప్రజలు గుర్తుకు వస్తారు. అవి అయిపోగానే.. మళ్లీ సినిమాల రెమ్యూనరేషన్లు రుచిగా అనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు… సగటు రాజకీయ నేతల కన్నా సినిమా వాళ్లే ఈ మధ్య కాలంలో పచ్చిగా అబద్ధాలు చెబుతూ ఉన్నారు.
తమ తమ సినిమాల్లో హీరోలుగా బోలెడన్ని విలువల పాఠాలు చెప్పే ఈ సినిమా నటులు రాజకీయాల వైపు వచ్చి మాత్రం పచ్చి అబద్ధాలు చెబుతూ ఉన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ జనసేన అధినేత పవన్ కల్యాణ్.రాజకీయాల వైపు వచ్చిన పుష్కరకాలంలోనే ఇప్పటికే ఆయన పార్టీలు మార్చేశారు, ఆయన జట్టు కట్టినని పార్టీలతో జట్టు కట్టిన వారు మరొకరు లేకపోవచ్చు.
ఏ ఎండకా గొడుగు పట్టినట్టుగా పచ్చి అవకాశవాదాన్ని కనబరుస్తూ ఉన్నారు. బీజేపీని నిందించినా ఆయనే, బీజేపీని నెత్తికెత్తుకున్నా ఆయనే! మాయావతి కాళ్ల మీద పడినా ఆయనే, బీజేపీ వ్యతిరేక పార్టీలను తప్పు పట్టినా ఆయనే! చంద్రబాబుతో చేతులు కలిపినా ఆయనే, రహస్య స్నేహం చేసినా ఆయనే! కమ్యూనిస్టులతో కలిసి నడిచినా ఆయనే.. రాత్రికి రాత్రి ఎర్రజెండాలు పీకి కాషాయ జెండాలు కట్టినా ఆయనే!
సినిమాల్లో రాజకీయ నేతల తీరును విమర్శిస్తూ ఉంటారు పవన్ కల్యాణ్. పాలిటిక్స్ పై బోలెడన్ని సెటైర్లు వేస్తూ ఉంటారు. నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుడిని.. అంటూ పాటలకు స్టెప్పులు వేస్తారు. రాజకీయంలో మాత్రం అలాంటి నమ్మకం లేని రాజకీయాన్నే ప్రదర్శిస్తూ జనాల కళ్లు తెరిపిస్తూ ఉన్నారు.
ఈ తీరుతోనే పవన్ కల్యాణ్ పూర్తిగా ప్రజల తిరస్కరణ పొందుతూ ఉన్నారని స్పష్టం అవుతూ ఉన్న విషయం. ఇలాంటి పవన్ కల్యాణ్ నే బీజేపీ ఇప్పుడు మోస్తూ ఉంది. ఒక జాతీయ పార్టీ, తమది భారత జాతి పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. ఏ రకంగానూ బీజేపీ చెప్పే విలువలతో మ్యాచ్ కాని పవన్ కల్యాణ్ ను ఎలా సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఉందో!
కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ సినిమా వాళ్లకు పెద్ద పీఠ వేస్తూ ఉంది! ఈ జాబితా పెద్దదే. బెంగాల్ లో ఇటీవలే మిథున్ చక్రబర్తిని చేర్చుకున్నారు. యూపీలో రవికిషన్, కేరళలో సురేష్ గోపి, తమిళనాట చోటా మోటా సినిమా వాళ్లతో పాటు.. రజనీకాంత్ పై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ప్రకటించేశారు.
ఇలా రజనీకాంత్ అభిమానుల ఓట్లకు బీజేపీ గట్టిగా గాలం వేస్తోంది. ఇక ఇటీవలి జాతీయ సినిమా అవార్డుల విషయంలో కూడా ఇలాంటి విమర్శలే చెలరేగాయి. భారతీయ జనతా పార్టీ గల్లీ కార్యకర్తలా సోషల్ మీడియాలో స్పందించే కంగనా రనౌత్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డును ఇవ్వడంలో కూడా పచ్చి రాజకీయమే గోచరించింది. ఒకటి తమకు అనుకూలంగా పని చేసే సినిమా వాళ్లకు, లేదంటే తాము ఆశలు పెట్టుకున్న నటీనటుల కోసం బీజేపీ అవార్డులను ఎరగా వేస్తోందనే విమర్శలు తీవ్రం అవుతున్నాయి.
ఇక బాలీవుడ్ కూడా ఈ బిస్కెట్లకు బాగా అలవాటు పడిందని సినీ అభిమానులే బాహాటంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దేశంలో సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్ సెలబ్రిటీలు కూడా కేంద్రం అజెండాకు అనుగుణంగా స్పందిస్తున్నారనే విమర్శలు రానే వస్తూ ఉన్నాయి. రైతు ఉద్యమం విషయంలో సినీ సెలబ్రిటీల స్పందన, బీజేపీ ఆఫీసు ముందు బిచ్చగాళ్లలా స్పందించే కంగనా లాంటి వాళ్ల స్పందన.. ఇదంతా గమనిస్తే.. సగటు ప్రజలకు కూడా ఈ విన్యాసాలన్నీ ఏవగింపుగా మారాయి.
అధికారం ఉన్న వారికి ఏమీ అనిపించకపోవచ్చు కానీ, ఈ భజన బృందాల హడావుడి, ఈ భజన బృందాలకు దక్కే పురస్కారాలు.. ఇవన్నీ కూడా మొదటికే మోసం కాగలవు!