పెద్దరెడ్డి గారు కూడా పోవడమొక్కటే మిగిలింది!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలలో అధిష్ఠానం సంస్కరణలు చేపట్టింది.నిజానికి కమిటీలో మార్పు చేర్పులు చేసే ప్రతిసారీ అధిష్ఠానం సంస్కరిస్తున్నామనే అనుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మల్లికార్జున ఖర్గే జాతీయ సారథి అయిన తర్వాత.. పునర్…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలలో అధిష్ఠానం సంస్కరణలు చేపట్టింది.నిజానికి కమిటీలో మార్పు చేర్పులు చేసే ప్రతిసారీ అధిష్ఠానం సంస్కరిస్తున్నామనే అనుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మల్లికార్జున ఖర్గే జాతీయ సారథి అయిన తర్వాత.. పునర్ వ్యవస్థీకరించిన రాష్ట్ర కమిటీల్లో ఎక్కడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ చోటు ఇవ్వలేదు. 

మొన్న మొన్నటి దాకా పీసీసీ రేసులో ఉన్నంతటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, తనకు పీసీసీ పీఠం అప్పగిస్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టి అయినా పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని అధిష్ఠానానికి హామీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అసలు ఏ కమిటీలోనూ చోటు ఇవ్వకపోవడం గమనార్హం.ఇక తమ్ముడి బాటను అనుసరించి.. పెద్ద కోమటిరెడ్డి కూడా కమలతీర్థం పుచ్చుకోవడం ఒక్కటే మిగిలుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చిన్న ముసలమే పుట్టింది. మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిజెపిలో చేరి తిరిగి తలపడ్డారు. తల బొప్పి కట్టింది. కోట్లు కుమ్మరించినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నిక సమయంలోనే మునుగోడు ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ గా భువనగిరి ఎంపీ వెంకటరెడ్డిని పార్టీ నియమించింది. అయితే ఆయన ఆ ఎన్నిక గురించి, ఎన్నికలో కాంగ్రెస్ అనుకూల ప్రచారం గురించి అస్సలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంచక్కా ఆస్ట్రేలియా వెళ్లిపోయి అక్కడ గడిపారు. 

తమ్ముడు తనవాడు కావడంతో.. కాంగ్రెస్ ను ఆయన పట్టించుకోలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి.. రాజగోపాల్ రెడ్డి విజయానికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా కోవర్టు ప్రచారం చేసినట్లుగా ఆడియో రికార్డింగులు లీక్ అయ్యాయి. దీంతో పార్టీలో ఆయన పరువు మరింతగా భ్రష్టుపట్టిపోయింది. మునుగోడులో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది లేదని బహిరంగంగా వ్యాఖ్యానించి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. ఇటీవల ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని కూడా వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో టీపీసీసీ కార్యవర్గం పునర్ వ్యవస్థీకరణ, కొత్త కమిటీల ఏర్పాటులో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ అసలు పట్టించుకోలేదు. ఆయన కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టుగానే భావించాల్సిందే. కాంగ్రెస్ లో ముఠా రాజకీయాల నేపథ్యంలో పార్టీకి దూరమైన కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం పంచన చేరి సాధించేది ఏమైనా ఉన్నదా? అనేది పెద్ద ప్రశ్న. తమ్ముడి బాటలోనే ఆయన కూడా బిజెపిలోకి వెళ్లవచ్చునేమో గానీ.. అక్కడ వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది. 

పీసీసీ ఆశించే స్థాయి నాయకుడికి ఆ పార్టీ అంత విలువ ఇస్తుందా? కోట్లు నష్టపోయిన రాజగోపాల్ రెడ్డికే ఇప్పటిదాకా పెద్ద ప్రాధాన్యం లేదు. వేరే గత్యంతరం లేక వెంకటరెడ్డి కూడా వెళ్లాల్సిందే గానీ.. వారు ఎంత విలువ ఇస్తారు.. వీరు ఏ కొత్త విజయాలను సాధిస్తారు అనేది అర్థం కాని సంగతి.