“ఎత్తుకు పైఎత్తులు వేయడంలో దిట్ట. తిమ్మిని బమ్మని చేయడంలో తిరుగులేని వ్యక్తి. వెన్నుపోటు రాజకీయాలకు అసలైన ఆద్యుడు. ఆయనది క్రిమినల్ బ్రెయిల్.” తిట్టినా-పొగిడినా చంద్రబాబు బుర్రను మెచ్చుకున్నోళ్లే అంతా. అలాంటి బుర్ర మళ్లీ ఎవ్వరికీ రాదని, లోకేష్ కు ఆ బుర్రలో పది శాతం కూడా రాలేదని విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇదంతా ఒకప్పుడు.
ఇప్పుడు చంద్రబాబు బ్రెయిన్ షెడ్డుకెళ్లింది. ఆయనింకా 1995 నాటి తెలివితేటలే వాడుతున్నారు. వెన్నుపోటు కాలంనాటి వ్యూహాల్నే అమలుచేస్తున్నారు. ఇది ఆయన తప్పు కాదు. వయసుతో వచ్చిన వెనకబాటుతనం. మూడు రాజధానుల అంశానికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడిన తర్వాత.. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు చూస్తంటే.. ఆయనింకా పాతికేళ్ల వెనకే ఉండిపోయారనిపిస్తోంది.
ఏపీ పరిపాలన-వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. సీఆర్డీఏ బిల్లు కూడా రద్దయింది. రెండు బిల్లులపై గవర్నర్ సంతకాలు పూర్తయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే రాజీనామా డ్రామాకు తెరలేపారు. ఎమ్మెల్సీ బీటెక్ రవితో రాజీనామా చేయించారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు దొరికిపోయారు. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి.
ఒకటి.. నిజంగా బీటెక్ రవి రాజీనామా చేయాలనుకుంటే నేరుగా తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ ఫార్మాట్ లో పంపించాలి. కానీ ఆయన ఆ పని చేయలేదు. తన రాజీనామా లేఖను, మండలితో ఏమాత్రం సంబంధం లేని చంద్రబాబుకు పంపించారు. మండలి ఛైర్మన్ కు తర్వాత రాజీనామా పంపుతారట.
ఇక రెండో విషయం.. నిజంగా చంద్రబాబుకు 3 రాజధానుల అంశంపై, గవర్నర్ నిర్ణయంపై అంత కోపం ఉంటే తన ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించకూడదు. రేపోమాపో మండలి అధ్యాయం ముగిసిపోతుంది. కాబట్టి గట్టిగా తన నిరసన తెలియజేయాలంటే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి. అంతేకాదు.. తను కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇవి చేయకుండా.. కేవలం బీటెక్ రవితో రాజీనామా చేయించి డ్రామాలు ఆడుతున్నారు బాబు.
ఇదొక ఎత్తయితే.. ఎప్పట్లానే మరోసారి దీనిపై కూడా హైకోర్టుకు వెళ్తామంటున్నారు బాబు. అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఇప్పటికే కోర్టుల్లో ఛాలెంజ్ చేసిన బాబు.. ఇప్పుడు ఏకంగా గవర్నర్ సంతకం చేసిన నిర్ణయాన్ని కూడా సవాల్ చేయాలనుకోవడం మూర్ఖత్వం.
ఇలా మూడు రాజధానుల అంశానికి సంబంధించి చంద్రబాబు ఇంకా తన పాతకాలం బ్రెయిన్ నే వాడుతున్నారు. ఇది సోషల్ మీడియా కాలమని, తమ నాయకుడు అప్ డేట్ అయితే బాగుంటుందని అతడి పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు.. చంద్రబాబు చేస్తున్న ఈ పనులతో.. మొన్నటివరకు రాజధాని తరలిపోకుండా బాబు ఆపుతారనే ఓ వర్గానికి కూడా ఇప్పుడు పూర్తిగా నమ్మకం పోయింది.