మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్రపై అన్ని పార్టీలు తమ స్పందనని వెంటనే తెలియజేశాయి. వైసీపీ స్వాగతించింది, టీడీపీ కోర్టుకెళ్తామంది, బీజేపీలో కొందరు సంతోషించారు, ఇంకొందరు రైతుల పక్షాన పోరాడతామన్నారు. జనసేన మాత్రం ఎప్పట్లానే కాస్త నిదానంగా, నింపాదిగా తన స్పందన తెలియజేసింది. ఎందుకంటే ఓవర్ గా మూడు రాజధానుల వ్యవహారంపై మాట్లాడితే.. సుజనా చౌదరికి జరిగిన మర్యాదే తనకు జరుగుతుందని పవన్ కల్యాణ్ కి బాగా తెలుసు. అందుకే గవర్నర్ ప్రకటన తర్వాత పవన్ ఆచితూచి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఇక ఆ వివరాలు చదివితే అసలు పవన్ కల్యాణ్ అమరావతికి మద్దతిస్తున్నారా, బీజేపీకి వంతపాడుతున్నారా, మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏదీ అర్థం కాదు. కరోనా వైరస్ ని అడ్డం పెట్టి మరీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి పవన్ కల్యాణ్ ది. కరోనా కష్టకాలంలో అసలు మూడు రాజధానుల నిర్ణయం ఏంటని ప్రశ్నంచారు జనసేనాని.
అసలు 33వేల ఎకరాల్లో రాజధాని వద్దు అని మొదటినుంచీ చెబుతున్నామని టీడీపీ ప్రభుత్వం తమ మాట వినలేదంటూ సంబంధంలేని సబ్జెక్ట్ ని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంతపాడిందని, ఇప్పుడు వేరే నిర్ణయం తీసుకుందని తన ఆవేదన వెళ్లగక్కారు. అంటే అటు బీజేపీకి నొప్పి కలగకుండా, ఇటు జగన్ ని విమర్శించాలనే ఉద్దేశంతో విచిత్రంగా స్పందించారు పవన్. చివరిగా అమరావతి రైతుల కోసం తుదికంటూ పోరాడతానని మాత్ర గట్టిగా చెప్పుకున్నారు.
వాస్తవానికి గవర్నర్ రాజముద్ర తర్వాత పవన్ కల్యాణ్ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ కామెంట్స్ పడ్డాయి. రైతులకు మద్దతుగా తుళ్లూరు ప్రాంతంలో పవన్ కల్యాణ్ చేసిన డ్రామా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. రోడ్డుపై కుర్చుని, ముళ్లకంచెలు దాటుకెళ్తూ, ఓవైపు జుట్టు సరిచేసుకుంటూ, మరోవైపు ఫొటోలకు ఫోజులిస్తూ, ఎవరో కంచంలో పెట్టిన అన్నం తింటూ.. అబ్బో అప్పట్లో పెద్ద సీన్ క్రియేట్ చేశారు పవన్ కల్యాణ్. ఇప్పుడేమో బీజేపీ మొట్టికాయలు పడతాయేమోనని సైలెంట్ అయ్యారు.
రైతుల పక్షాన నిలబడతానన్న పవన్ ఎక్కడికి పోయావంటూ ప్రశ్నించారు కొంతమంది. జనసైనికులు మాత్రం గవర్నర్ నిర్ణయంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించగా, పవన్ మాత్రం నోరు కట్టేసుకున్నారు.