పూర్వ కాలంలో రాజులు వరుసగా యుద్ధాలు చేస్తూ, రాజ్యాలను జయిస్తూ జైత్రయాత్ర చేసేవారు. ఓడిన రాజులను సామంతులుగా చేసుకునే వారు. రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. ప్రజాస్వామ్యంలో పోరాటమంటే ఎన్నికలే. అధికార పార్టీలు. ప్రతిపక్షాలు బలాబలాలు నిరూపించుకోవడానికి, అమీతుమీ తేల్చుకోవడానికి ఎన్నికలే మార్గం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు పోరాటం చేయడానికి అనేక రకాల ఎన్నికలున్నాయి.
ఎంపీటీసీ, జడ్పిటీసి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, సహకార ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, వీటిల్లో లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలు, ఇవికాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు … ఇలా ఎన్నెన్నో ఎన్నికలు పార్టీల పోరాటానికి వేదికలుగా ఉన్నాయి.
ఇవి కాకుండా మరణం, మరికొన్ని కారణాలవల్ల వచ్చే ఉప ఎన్నికలు. తెలంగాణలో ఏ రకమైన ఎన్నికలు జరిగినా అవి హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇక్కడి ప్రతిపక్షాలకు అధికార పార్టీకి పోటీ ఇచ్చే శక్తి అంతో ఇంతో ఉంది. దీంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ప్రతి ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచారం కూడా ఆ స్థాయిలోనే సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. అధికార పార్టీకి మరీ ఘోరపరాభవం సంభవించకపోయినా ఓటమి మూటగట్టుకుంది. దీంతో అక్కడ గెలిచిన బీజేపీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది.
దుబ్బాక తరువాత ఎక్కువ గ్యాప్ లేకుండానే జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఊపు కొనసాగింది. అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చింది. దాని ఆధిపత్యాన్ని దెబ్బతీసింది. దీంతో ఆ తరువాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ కు బీజేపీ అంటే కాస్తంత భయం పట్టుకుంది. ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలో తొందర పడటంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, జరగబోతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలోనూ చివరివరకు వెయిట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు. సాగర్ ఉపఎన్నికలోనూ ఫలితం అనుకూలంగా ఉండదనే అంచనాలున్నాయి. ఇక్కడ పోటీ కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో అయిపోవు. పార్టీలు మరో ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
మే నెలలో ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు, మరో అయిదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సిద్ధిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకరికల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండోవారంలో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. మొన్నటి బడ్జెట్లో ప్రభుత్వం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించింది. ఎన్నికలు జరగాల్సిన మున్సిపాలిటీల్లోనూ యేవో పనులు చేస్తూనే ఉంది.
ఈ ఏడు ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు. రెండు కార్పొరేషన్లను, అయిదు మునిసిపాలీటీలను కైవసం చేసుకుంటే ఇక తిరుగుండదని అనుకుంటున్నాయి. ఈ కథ ఎలా ఉంటుందో చూడాలి.