అవతల జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు ఊచలు లెక్కబెడుతున్నారు. బెయిల్ పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. అయితే వారికి ఇప్పటి వరకూ బెయిల్ లభించడం లేదు. మరోవైపు జేసీల తెలుగుదేశం దోస్తు పరిటాల శ్రీరామ్ కూడా ఇప్పుడు వారంలో రెండు రోజుల పాటు పోలిస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు పెట్టి వచ్చే పరిస్థితికి వచ్చారు. అధికారం ఉన్నప్పుడు చేసిన వ్యవహారానికి సంబంధించి పరిటాల శ్రీరామ్ పై కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా కొట్టాడనే అభియోగాలపై శ్రీరామ్ పై కేసు నమోదయ్యింది.
తమ రాజకీయ ప్రత్యర్థి తమ ఊరికి వచ్చాడని, అందుకు సహకరించిన వ్యక్తిని పరిటాల శ్రీరామ్ రౌడీయిజం చేశాడని కేసు నమోదయ్యింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి… 2018 ఫిబ్రవవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డి నసనకోట గ్రామానికి వెళ్లాడట. నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించాడాయన. ఆ ఆలయం పరిటాల కుటుంబ సొంతూరికి సమీపంలో ఉంటుంది. అక్కడకు తోపుదుర్తి చందూ రావడం పరిటాల శ్రీరామ్ కు నచ్చలేదట. అక్కడకు చందూ వచ్చినప్పుడు ఏర్పాట్లు చేసిన సూర్యం అనే వ్యక్తిని పరిటాల శ్రీరామ్ కిడ్నాప్ చేయించి, తీవ్రంగా కొట్టించాడట. అనంతరం ఆ వ్యక్తితో తోపుదుర్తి చందూ మీదే రివర్స్ లో కేసు పెట్టించాడని సమాచారం.
ఈ వ్యవహారంపై సూర్యం పలు సార్లు జిల్లా ఎస్పీని కలిసి వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ పై కేసులు నమోదయ్యాయి. కేసులయితే నమోదయ్యాయి కానీ, అవి విచారణ పేరుతో పెండింగ్ లో ఉండి పోయినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో తాజాగా పునర్విచారణ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించాయి. దీంతో పరిటాల శ్రీరామ్ అరెస్టు అవుతారనే భయాల నేపథ్యంలో ఆయన వెళ్లి ముందుస్తు బెయిల్ పొందినట్టుగా సమాచారం. కండీషనల్ బెయిల్ లభించగా, ప్రతి మంగళవారం- శుక్రవారాలు రామగిరి పోలిస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు పెట్టాలనే కండీషన్ మీద శ్రీరామ్ కు బెయిల్ లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అధికారం ఉన్నప్పుడు మీసాలు మెలేసిన వాళ్లు ఇప్పుడిలాంటి పరిస్థితికి వచ్చినట్టున్నారు!