కిడ్నాప్‌నకు గురైన డాక్టర్ వైశాలి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలితో గత ఏడాది పెళ్లి అయ్యిందని కిడ్నాపర్ నవీన్‌రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని బాధితురాలి డాక్టర్ వైశాలి పేర్కొంది. కాసేపటి క్రితం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను బలవంతంగా లాక్కెళ్లారని వాపోయారు. తన కెరీర్‌ను సర్వనాశనం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నవీన్‌రెడ్డితో పెళ్లిందైన్న వార్తల్లో నిజం లేదన్నారు. నవీన్ పెళ్లైనట్టు చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్నట్టు ఆమె చెప్పారు. నవీన్‌తో ఉన్న ఫొటోలన్నీ మార్ఫింగ్ అని ఆమె అన్నారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లే క్రమంలో కారులో తనను దారుణంగా హింసించారన్నారు. తనపై నవీన్ దాడి చేశాడన్నారు. తనను గాయపరిచినట్టు ఆమె దెబ్బల్ని చూపారు. తన తండ్రి కూడా ఎప్పుడూ ఇలా కొట్టలేదని వాపోయారు.
పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పినా వినలేదన్నారు. తనను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోకూడదని అతను రాక్షసంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనకిష్టం లేదని చెప్పినప్పటి నుంచి ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.
కారులో తన జుట్టు పట్టుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టాడని వాపోయారామె. నవీన్ కారు కొనుగోలుకు సంబంధించి తాను నామినీగా సంతకం చేశారని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. అతనితో కేవలం స్నేహం మాత్రమే వుండేదన్నారు. ప్రేమ, పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా తాను వ్యతిరేకించినట్టు డాక్టర్ వైశాలి తెలిపారు.
తన పేరుతో నకిలీ ఇన్‌స్టా ఖాతా క్రియేట్ చేశాడన్నారు. నవీన్‌తో తాను ఎప్పుడుగా ఒంటరిగా వెళ్లలేదన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లినట్టు డాక్టర్ వైశాలి తెలిపారు. తనకు భద్రత కావాలని ఆమె పోలీసులను కోరారు. విచారణలో ఏది నిజమో తేల్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.