దేశంలో కరోనా విలయతాండవంతో పోల్చి చూస్తే.. ఏపీలో పరిస్థితి చాలా బెటర్. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావాళ్లని ఎవరినడిగినా ఈ విషయం తెలుస్తుంది. మరి హైదరాబాద్ లో మకాం పెట్టిన చంద్రబాబుకి ఎందుకు తెలియడం లేదు.
కరోనా విలయం మొదలైనప్పటి నుంచి ఓ పద్ధతి, ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు చంద్రబాబు.
బాబు వాదన 1: ఏపీలో సరిగా టెస్ట్ లు చేయడంలేదు
మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో కేసులు తక్కువగా నమోదవుతున్న సమయంలో బాబు ఈ వితండవాదానికి తెరతీశారు. ఏపీలో సరిగా టెస్ట్ లు చేయడంలేదని, అందుకే కేసులు తక్కువగా నమోదవుతున్నాయంటూ విమర్శించారు. అంటే ఏపీలో తక్కువ కేసులుండటం చంద్రబాబుకి ఇష్టంలేదనమాట, అందుకే అలా మాట్లాడారు.
బాబు వాదన 2: ఏపీలో కేసులు పెరిగిపోతున్నాయి, ఏంచేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్ ల విషయంలో సమగ్ర విధానంతో ముందుకెళ్తోంది. దేశం మొత్తం కొవిడ్ టెస్ట్ కిట్ లు దిగుమతి చేసుకుంటున్న దశలో, తొలిసారి రాష్ట్రంలో తయారైన టెస్టింగ్ కిట్ వినియోగించిన ఘతన ఏపీకి దక్కింది. ఆ తర్వాత టెస్ట్ ల సంఖ్య పెంచి, సంజీవని బస్సుల ద్వారా పల్లెల్లో కూడా పరీక్షలు చేయడంతో సహజంగానే కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబుకి టెస్ట్ ల సంఖ్య పెరిగిందనే విషయాన్ని దాచిపెట్టి, కేసులు పెరిగిపోతున్నాయని బాధపడ్డారన్నమాట.
బాబు వాదన 3: టెస్ట్ లు సరే.. రిజల్ట్ లేటెందుకు?
నమూనాల సేకరణకు సిబ్బంది ఉన్నారు కానీ, వాటిని విశ్లేషించి కరోనా నిర్థారించే ల్యాబొరేటరీలు, అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత రాష్ట్రంలో ఉంది. ఆ మాటకొస్తే దేశంలోనే ఈ కొరత ఉంది. దీని కోసమే ఇటీవల వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ కూడా ప్రభుత్వం ప్రారంభించింది. అందుకే ట్రూనాట్ టెస్ట్ ల రిజల్ట్ వేగంగా వస్తున్నా.. నెగెటివ్ ని కన్ఫామ్ చేసే రెండోదశ టెస్ట్ ల విషయంలో రెండు రోజులు టైమ్ పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు టెస్ట్ లు లేటవుతున్నాయి, రాష్ట్రం అల్లకల్లోలమైపోతోంది అంటూ గగ్గోలు పెడుతున్నారు. శాంపిల్స్ సేకరణ ఎక్కువగా జరగడంతో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కానీ, ఇందులో వైద్య సిబ్బంది తప్పుకానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఎంతమాత్రం లేదు. అందుకే ఇప్పుడు రిజల్ట్ విషయంలో యాగీ చేస్తున్నారు బాబు.
ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు సగటు మరణాల విషయంలో ఎందుకు నోరు మెదపరు. కరోనా మరణాల విషయంలో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉంది. జాతీయ మరణాల రేటు సగటున 2.21 ఉండగా.. ఏపీలో మరణాల రేటు 1.01 గా ఉంది. అంటే ఏపీలో 100 కరోనా కేసుల్లో ఒకరు మాత్రమే పరిస్థితి విషమించి మరణించే అవకాశముందన్నమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయం కాదా? జగన్ ప్రభుత్వం ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కల్పిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి.
కేంద్రం విడుదల చేసే గణాంకాలు దగ్గర పెట్టుకుని సెటైర్లు వేసే చంద్రబాబు మరణాల రేటులో ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉందని ఎందుకు చెప్పరు. గతంలో వెన్నుపోటు రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాబు, ఇప్పుడు కరోనా రాజకీయానికి పేటెంట్ తీసుకున్నారు అంతే తేడా.