ఇది పవన్ విద్యావిధానం కాదు.. మరీ అంతగా లేపాలా?

వృత్తి విద్య. భారత విద్యా విధానంలో ఇది ఎప్పటినుంచో అమలులో ఉంది. పాలిటెక్నిక్, ఐటీఐ.. ప్రత్యేకంగా వృత్తి విద్యల కోసం డిజైన్ చేసిన కోర్సులే. అయితే వీటిని ప్రత్యేక కోర్సులుగా కాకుండా మెయిన్ స్ట్రీమ్…

వృత్తి విద్య. భారత విద్యా విధానంలో ఇది ఎప్పటినుంచో అమలులో ఉంది. పాలిటెక్నిక్, ఐటీఐ.. ప్రత్యేకంగా వృత్తి విద్యల కోసం డిజైన్ చేసిన కోర్సులే. అయితే వీటిని ప్రత్యేక కోర్సులుగా కాకుండా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చేలా కేంద్ర కేబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానం ఉంది. ఇక్కడిదాకా బాగుంది. అయితే సాక్షాత్తూ కేంద్ర మంత్రే ఈ వృత్తి విద్యా విధానాన్ని పవన్ కల్యాణ్ ఆలోచనల నుంచి తీసుకున్నామని చెప్పడం, దానికి గతంలో పవన్ మాట్లాడిన ఓ క్లిప్పింగ్ జతచేసి ట్విట్టర్లో వదలడం కామెడీ కాక ఇంకేంటి.

పవన్ కల్యాణ్ ఇంటర్ చదివే రోజుల్లో కాలేజీలో కార్పెంటర్ పని నేర్చుకోలేకపోయానని బాధపడ్డారట, ఆ బాధలో నుంచి వచ్చిన ఆలోచనను ఆయన ఓ సందర్భంలో మీడియా ముందుంచారు. అయితే పవన్ కల్యాణ్ కి అలాంటి వృత్తి విద్యలు నేర్చుకోవాలనుకుంటే పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి కోర్సులుంటాయని తెలియకపోవచ్చు. తెలిసినా ఇంట్లోవాళ్లు ఇంటర్లో చేర్పించారని ఆయన సర్దుకుపోయి ఉండొచ్చు. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని కామర్స్ ట్యూషన్ కి కూడా ఆయన వెళ్లి ఉండొచ్చు. చివరికి ఇంటర్మీడియట్ ఆయనకి కలగానే మిగిలి ఉండొచ్చు.

ఇవన్నీ పక్కనపెడితే నూతన విద్యా విధానం ప్రకటించిన తర్వాత ఎవరో జనసైనికులు ఈ పాత క్లిప్పింగ్ ను పట్టుకుని తెగ ప్రచారం చేసుకున్నారు. దాన్నే కేంద్ర మంత్రి కూడా తన ట్వీట్ కి జతచేశారంతే. అయితే ఈ ట్వీట్ ని పట్టుకుని పవన్ కల్యాణ్ ని ఓ విద్యావేత్తగా జనసైనికులు సోషల్ మీడియా అంతా హోరెత్తిస్తున్నారు. అసలు సిఫార్సులు చేసిన కస్తూరి రంగన్ ని, ఆ కమిటీని మర్చిపోయి, కొసరు మాట్లాడిన పవన్ ని హైలెట్ చేసుకుంటున్నారు.

ఆరో తరగతి నుంచి వృత్తి విద్య అమలైతే అందరికీ సంతోషమే. పదో తరగతి చదివి బైటకొచ్చేవారిలో ప్రతి ఒక్కరికీ ఒక్కో వృత్తిలో ప్రవేశం ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది. అయితే ఇప్పటికే కళాశాల స్థాయిలో ఇలాంటి విధానం అమలులో ఉంది. పాఠశాలల్లో కూడా నిబంధనల ప్రకారం ల్యాబ్ లు అందుబాటులో ఉండాలి. కాలేజీల్లో కచ్చితంగా ల్యాబొరేటరీల్లో ప్రయోగాలు చేయాల్సిందే.

మరి ఇవేవీ ఇప్పుడు అమలు కావడం లేదే. ల్యాబ్ ల మొహమే తెలియకుండా పది పాసైన విద్యార్థులున్నారు. ప్రాక్టికల్స్ అంటే కేవలం రికార్డులు రాయాలి అనుకునే కాలేజీ స్టూడెంట్లున్నారు. మౌలిక వసతులు కల్పించి, సరైన ఉపాధ్యాయుల్ని నియమించి, ధీటైన కరికులమ్ అందించినప్పుడే ఇవన్నీ ఆచరణలో సాధ్యం.

ఇప్పటికే ఉన్నవాటిని పట్టించుకోకుండా కేవలం విద్యా విధానాన్ని మారిస్తే అది ఆరంభశూరత్వమే అవుతుంది. ఏదేమైనా కేంద్ర నూతన విద్యా విధానం వెనక తెలుగువాడైన పవన్ కల్యాణ్ ఆలోచనలు ఉన్నందుకు మనమంతా గర్వించాల్సిందే. అయితే దీన్ని కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే ఉపయోగించుకోవడం చూసి బాధపడాల్సిందే. 

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది