నగరి ఎమ్మెల్యే రోజా పంతం నెగ్గించుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని నిండ్ర ఎంపీపీ విషయంలో తన మాట కాదని, మరొకరిని ఎన్నుకోవాలనే ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. కాస్త ఆలస్యంగానైనా తాను ఎంపిక చేసిన వాళ్లనే ఎంపీపీ పీఠంపై రోజా కూచోపెట్టడం విశేషం.
గత నెల 24,25 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రోజా నియోజకవర్గ పరిధిలోని నిండ్రలో కూడా ఎన్నుకోవాల్సి వుండింది. అయితే వైసీపీలో ఆధిపత్య పోరుతో రోజా మాట చెల్లుబాటు కాలేదు. నిండ్ర మండల పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో ఏడింటిలో వైసీపీ , ఒక చోట మాత్రం టీడీపీ గెలుపొందింది.
ఎంపీపీగా ఎలకాటూరు ఎంపీటీసీ సభ్యురాలు దీపను రోజా ఎంపిక చేశారు. అయితే రోజా నిర్ణయాన్ని పార్టీలోని మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్న శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి వ్యతిరేకించారు. దీంతో ఆయన తరపున ఐదుగురు ఎంపీటీసీలు రోజా ఎంపిక చేసిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ విభేదాలు బజారున పడ్డాయి. మండల పరిషత్ కార్యాలయ వేదికగా తమ పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎంపీటీసీలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చక్రపాణిరెడ్డి తమ్ముడు భాస్కర్‌రెడ్డిపై రోజా మండిపడ్డారు. మగాళ్లైతే పదవులకు రాజీనామా చేసి తలపడాలని సవాల్ విసిరారు. పార్టీ విప్‌ను ధిక్కరించడంతో పాటు తనకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్న రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజా ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రజాభిప్రాయానికి భిన్నంగా నియంతలా వ్యవహరిస్తున్న రోజాపై చర్యలు తీసుకోవాలని ప్రత్యర్థి వర్గీయులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇరువురితో చర్చించి పరిష్కార మార్గాన్ని సూచించింది. ఎమ్మెల్యే రోజా ఎంపిక చేసిన వారికే మద్దతు ఇచ్చేలా చక్రపాణిరెడ్డి వర్గీయులను ఒప్పించారు. దీంతో ఇవాళ నిండ్ర ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక రోజా నేతృత్వంలో విజయవంతంగా ముగిసింది. అందరూ ఐక్యంగా రోజా ఎంపిక చేసిన వారినే ఎన్నుకున్నారు. వైసీపీ ఎంపీటీసీ సభ్యులందర్నీ రోజా సన్మానించడం గమనార్హం.