వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు భయం అంటే ఏంటో తెలియదు. చిత్ర పరిశ్రమ వ్యవహారాలైనా, సామాజిక అంశాలపైనైనా ఆమె తనవైన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ముక్కు సూటిగా మాట్లాడ్డంలో రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అలాంటి రోజా “మా” ఎన్నికల విషయంలో మాత్రం మనసులో మాట చెప్పడానికి వెనకాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఆమె ధోరణికి భిన్నమైందని చెప్పొచ్చు. “మా” ఎన్నికలపై రోజాను మీడియా ప్రశ్నించింది. తన రంగానికి చెందిన ఎన్నికలపై ఆమె ఉల్లాసంగా, ఉత్సాహంగా నవ్వుతూ స్పందించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కచ్చితంగా పాల్గొంటానన్నారు. ఎన్నికల్లో తలపడుతున్న రెండు ప్యానళ్లు మ్యానిఫెస్టోను విడుదల చేశాయన్నారు. మా అసోసియేషన్ సభ్యులను, సంస్థను అభివృద్ధి చేసే ప్రణాళికలు ఎవరి మ్యానిఫెస్టోలో ఉన్నాయో చూసి వాళ్లకు మాత్రమే ఓటు వేస్తానని ప్రకటించారు. అభివృద్ధి ప్రాతిపదికగానే తాను ఓటు వేస్తానని స్పష్టం చేశారు.
ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా తెరపైకి వచ్చిన లోకల్, నాన్‌లోకల్ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎవరికి ఓటు వేస్తారని మీడియా ప్రశ్నించగా…ఆమె కాసేపు ఆలోచనలో పడినట్టు కనిపించారు. ఆ తర్వాత నవ్వుతూ వివాదాస్పద ప్రశ్నలను తనను అడగొద్దని విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఇది ముమ్మాటికీ రోజా మనస్తత్వానికి విరుద్ధమైన స్వభావమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
“మా” ఎన్నికలు తమ రాజకీయ ఎన్నికలంటే చాలా వాడి, వేడిగా సాగుతున్నాయని రోజా అభిప్రాయపడ్డారు. అందువల్ల దాంట్లో తాను వేలు పెట్టాలని అనుకోవడం లేదని లౌక్యంగా సమాధానం ఇచ్చారు. కానీ ఒక ఆర్టిస్ట్‌గా తన ఓటును మాత్రం సద్వినియోగం చేసుకుంటానని రోజా చెప్పారు.