దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగరాసిన బాహుబలి సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైవ్ లో ఆర్కెస్ట్రా చేయబోతున్నారు. బాహుబలి – ది బిగినింగ్ సినిమాలో స్కోర్ ను లైవ్ కంపోజ్ చేయబోతున్నారు. ఈ ప్రఖ్యాత వేదికపై లైవ్ ఆర్కెస్ట్రా జరుపుకోనున్న మొట్టమొదటి నాన్-ఇంగ్లిష్ సినిమా ఇదే కావడం విశేషం. సినిమా స్క్రీనింగ్ తో పాటు లైవ్ ఆర్కెస్ట్రా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రకటించాడు.
అక్టోబర్ 19న జరగనున్న ఈ కార్యక్రమానికి బాహుబలి టీమ్ అంతా వెళ్లబోతోంది. అలా బాహుబలి సినిమాలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క మరోసారి కలవబోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ తెలుగు సినిమా కేవలం భారతీయ ప్రేక్షకుల్నే కాదు, విదేశీ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. అలా రాయల్ ఆల్బర్ట్ హాల్ కమిటీని కూడా ఇది ఆకర్షించింది. అందుకే తొలిసారిగా ఇంగ్లిష్ కాకుండా, మరో భాషకు చెందిన బాహుబలిని ఎంపిక చేశారు.
అయితే ఇది ఉచిత ప్రదర్శన మాత్రంకాదు. టిక్కెట్ కొనుక్కొని వెళ్లాలి. వీటి ధరలు 14 పౌండ్ల నుంచి 88 పౌండ్ల వరకు ఉన్నాయి. ప్రదర్శన తర్వాత సినిమా యూనిట్ తో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, కీరవాణి.. ప్రశ్నలకు సమాధానాలిస్తారు.