బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై బిహార్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకంపనలు రేపుతూ ఉంది. సుశాంత్ మరణించిన వెంటనే కాకుండా, కొంత సమయం తర్వాత ఆయన కుటుంబీకులు నటి రియా చక్రబర్తిపై సంచలన ఆరోపణలు తమ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తనయుడి ఆత్మహత్యకి కారణం రియా చక్రబర్తే అన్నట్టుగా ఉంది సుశాంత్ తండ్రి చేసిన ఫిర్యాదు.
తన తనయుడిని రియా, ఆమె కుటుంబ సభ్యులు మోసం చేశారని, అతడిని బెదిరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సుశాంత్ ఖాతా నుంచి కోట్ల రూపాయల డబ్బుల గత కొంతకాలంలో ట్రాన్స్ ఫర్ అయ్యిందని, అదెవరి ఖాతాల్లోకి బదిలీ అయ్యిందో కూడా తేల్చాలని ఆయన కంప్లైంట్ చేశారు. సుశాంత్ కు రియా అనవసరమైన మందులు ఇచ్చిందనే ఆరోపణ కూడా చేశారాయన.
సుశాంత్ ఆత్మహత్యపై మొదటి నుంచి కొందరు రియాను నిందిస్తూ ఉన్నారు. దీనిపై ఆమె ట్విటర్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ చేయించాలని కూడా ఆమె కోరింది. ఇలాంటి క్రమంలో సుశాంత్ కుటుంబ సభ్యులు మాత్రం రియా, ఆమె కుటుంబ సభ్యులపై సంచలన ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు బిహార్ పోలీసులు కేసులు నమోదు చేస్తారని, రియాను అరెస్టు చేస్తారని కూడా సుశాంత్ కుటుంబ సభ్యుల లాయర్ వ్యాఖ్యానించాడట.
ఈ క్రమంలో రియా కూడా చట్టపరమైన చర్యలకు రెడీ అయినట్టుగా ఉంది. సుశాంత్ మరణంపై జరుగుతున్న విచారణను ముంబై పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేయాలని ఆమె కోరుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంది ముంబైలో. ఈ క్రమంలో ఈ కేసులో బిహార్ పోలీసుల విచారణ సరికాదన్నట్టుగా రియా పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఉంది. మరి ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలన్న రియా పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో!