నటి శ్రీసుధ గురించి ఏమీ తెలుసుకోకుండా ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ ఇరుక్కున్నట్టున్నాడు. తాను సీఐనని, తనపైనే ఫిర్యాదు చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందిలే అనే లెక్కలేని తనమో కావచ్చు…మొత్తానికి నటి శ్రీసుధ కేసులో సీఐ వేలు పెట్టి మూల్యం చెల్లించుకునేలా ఉన్నాడు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో గతంలో నటి సుధ ఫిర్యాదు చేశారు. అప్పట్లో నటి ఫిర్యాదు మేరకు శ్యామ్ కే నాయుడిని పోలీ సులు అరెస్ట్ చేసి కటకటాలపాలు చేశారు. ఆ కేసులో శ్యామ్ కే నాయుడు కేసు రాజీ అయినట్టు శ్రీసుధ సంతకాన్ని ఫోర్జరీ చేసి వెంటనే బెయిల్పై బయటికి వచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న శ్రీసుధ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి…మళ్లీ అతన్ని జైలుకు పంపింది. దీన్ని బట్టి శ్రీసుధ ఎంత గట్టి మహిళో ఆ స్టేషన్ సీఐ మురళీకృష్ణకు బాగా తెలిసి ఉండాలి. సీఐ, నటి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ…ఉన్నట్టుండి సీఐ మురళీకృష్ణపై శ్రీసుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.
కేసు దర్యాప్తు కోసం సీఐ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అంతేకాక ఈ కేసులో శ్యామ్ కే నాయుడు తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు కూడా సృష్టించారని సీఐపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేవలం ఆరోపణలను గుప్పించడమే కాకుండా అందుకు తగ్గ ఆధారాలను కూడా నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు సమర్పించినట్టు సమాచారం. శ్యామ్ కే నాయుడిపై కేసు చివరికి ఆ పోలీస్స్టేషన్ సీఐపైకి టర్న్ కావడం ఒక మోస్తారు సంచలనం రేకెత్తిస్తోంది. అందులోనూ సీఐపై ఫిర్యాదు చేసిన మహిళ గ్లామర్ రంగానికి చెందిన వారు కావడంతో సహజంగానే మీడియా అటెన్షన్ అంతా అటు వైపు మళ్లింది.