హీరో విశాల్‌కు తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులున్నారు. కరోనాను జయించి తాను రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా నుంచి బయట పడేందుకు తన స్వీయ అనుభవాలను ఆయన ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన వీడియోలో కరోనా భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు.
ముందుగా తన తండ్రి జీకేరెడ్డి కరోనా పాజిటివ్ బారిన పడ్డారని, ఆయనకు సేవలు చేసే క్రమంలో తాను కూడా ఆ మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయానని చెప్పాడు. తనకు శరీర ఉష్ణోగ్రత 100-103కి పైగా ఉండడంతో పాటు దగ్గు, జలుబు అటాక్ అయ్యాయని తెలిపాడు. తన మేనేజర్ హరికి కూడా అవే లక్షణాలుండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపాడు. తమకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపాడు.
తాము ఆయుర్వేద మెడిసిన వాడటం వల్ల కేవలం వారం రోజుల్లో డేంజర్ నుంచి బయటపడినట్లు పేర్కొన్నాడు. కాగా కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నాడు. వైద్యుల సూచనల మేరకు ఒక పద్ధతి ప్రకారం మందులు వాడడం వల్ల జ్వరంతో పాటు కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాడు.
వారం రోజుల్లోనే తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు విశాల్ తెలిపాడు. తాను వాడిన మెడిసిన్ వివరాలను అతను ట్విటర్‌లో పంచుకున్నాడు. అయితే ఈ మందులను తమకు తాముగా గాకుండా వైద్యులను సంప్రదించి వాడాలని విజ్ఞప్తి చేశాడు. విశాల్ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు రియల్ హీరో అంటూ అభిమానులు కామెంట్స్‌తో తెగ పొగిడేస్తున్నారు.