ఎవరేమనుకున్నా వెనక్కు తగ్గేది లేదన్నట్టుగా స్పందిస్తోంది రష్యా. కోవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ ను తాము తయారు చేసినట్టుగా ఇది వరకూ రష్యా ప్రకటించింది. అది విజయవంతం అయినట్టుగా కూడా స్పష్టం చేసింది. ఒక వ్యాక్సిన్ విజయవంతం అని చెప్పడం అంత తేలిక కాదని, సుదీర్ఘమైన పరిశోధనలు అవసరం అని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే రష్యా మాత్రం తొలి దశలో తమ వ్యాక్సిన్ విజయవంతం అయినట్టుగా, ఆగస్టులో అందుబాటులోకి వస్తుందని ఇది వరకే ప్రకటించింది.
ఆ తర్వాత ఏం ప్రయోగాలు చేసిందో ఏమో కానీ.. ఆగస్టు పది తర్వాత రష్యాలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని మరోసారి ప్రకటించారు. అంతే కాదు.. ఆ వ్యాక్సిన్ ను ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారట. ప్రత్యేకించి కోవిడ్-19కు గురయ్యే అవకాశం ఉందనే వారికి ఆ వ్యాక్సిన్ ను వేయనున్నారట. బహుశా వైద్య సిబ్బందికీ గట్రానేమో!
అలాగే వృద్ధులను కూడా కోవిడ్ -19 ఇబ్బంది పెడుతోందనే విశ్లేషణల నేపథ్యంలో.. వాళ్లకు కూడా ఆ వ్యాక్సిన్ ను ఇస్తారా? అనే అంశానికి రష్యా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్టు 9 నాటికి వ్యాక్సిన్ కు పూర్తి ఆమోదం లభిస్తుందని, ఆ తర్వాత దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా మాత్రం స్పష్టం చేస్తోంది రష్యా. ఇలా ప్రపంచంలో తొలిగా రష్యాలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా, బ్రిటన్ లు తయారు చేస్తున్న వ్యాక్సిన్ లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. అక్టోబర్ లో అవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.