నీవు నా వాడివిః స‌మంత పోస్ట్ వైర‌ల్‌

జీవితమంటే జ్ఞాప‌కాల నిర్మాణం. ఇందులో తియ్య‌ని, చేదు జ్ఞాప‌కాలుంటాయి. ఈ రెండింటి రుచి చూసిన వాళ్ల‌కే, వాటి విలువ తెలుస్తుంది. అనుకున్న‌వి జ‌ర‌గ‌క‌పోవ‌డం, అనుకోన‌వి అనుభ‌వంలోకి రావ‌డ‌మే జీవితమంటే అని పెద్ద‌వాళ్లు ఏనాడో చెప్పారు.…

జీవితమంటే జ్ఞాప‌కాల నిర్మాణం. ఇందులో తియ్య‌ని, చేదు జ్ఞాప‌కాలుంటాయి. ఈ రెండింటి రుచి చూసిన వాళ్ల‌కే, వాటి విలువ తెలుస్తుంది. అనుకున్న‌వి జ‌ర‌గ‌క‌పోవ‌డం, అనుకోన‌వి అనుభ‌వంలోకి రావ‌డ‌మే జీవితమంటే అని పెద్ద‌వాళ్లు ఏనాడో చెప్పారు. మంచైనా, చెడైనా పాజిటివ్‌గా తీసుకుంటేనే జీవిత‌మ‌నే బండి ముందుకెళుతుంది.

తాజాగా స‌మంత‌-నాగ‌చైత‌న్య జంట విడిపోవ‌డంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏడాది క్రితం స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌… ప్ర‌స్తుతం వైర‌ల్ కావ‌డం గ‌మనార్హం. దీన్ని బ‌ట్టి ఆ పోస్ట్‌కున్న విలువ ఏ పాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. 2017, అక్టోబ‌ర్ 6-7 తేదీల్లో స‌మంత‌-నాగ‌చైత‌న్య త‌మ‌త‌మ వేర్వేరు మ‌త సంప్ర‌దాయాల ప్ర‌కారం పెళ్లి చేసుకున్నారు. త‌ద్వారా ప‌ర‌స్ప‌రం త‌మ మ‌తాల‌ను గౌర‌వించుకున్న‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7న వివాహ దినోత్స‌వం సంద‌ర్భంగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఉన‌న ఫొటోను షేర్ చేసి పెట్టిన పోస్ట్‌…ప్ర‌స్తుతం విడిపోయిన ప‌రిస్థితుల్లో వైర‌ల్ అయ్యింది.

‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌’ అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారామె. ఏడాది తిరగ‌కుండానే ఇద్ద‌రి మ‌ధ్య శాశ్వ‌త ఎడ‌బాటు వ‌చ్చింది.  

జీవితంపై  ప్రేమానురాగాల‌ను నింపుకుని, క‌ల‌కాలం క‌లిసి ఉండాల‌ని చేసుకున్న ఒప్పందాల‌న్నీ …ఏడాది తిరిగే స‌రికి కొట్టుకు పోయాయి. ఈ నెల 2న త‌మ విడాకుల గురించి నాగ‌చైత‌న్య‌-స‌మంత జంట ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. కాలం తీసుకొచ్చే మార్పుల‌కు అంద‌రూ త‌లొగ్గాల్సిందే అనేందుకు విడిపోయిన ఈ జంటే నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.