రాహుల్ గాంధీ విశాఖ వస్తున్నారుట. ఆ మాటకు వస్తే రాహుల్ ఏపీకి త్వరలో వస్తారు అంటూ చాలా కాలంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏపీ చాలా అవసరం. తెలంగాణాలో అయితే ఎంతో కొంత కాంగ్రెస్ బండి కదులుతోంది.
ఏపీలో చూస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దాంతో ఏపీలో పార్టీ రధ చక్రాలు కదిలించాలి అంటే రాహుల్ టూర్ వేసి తీరాల్సిందే అని కాంగ్రెస్ వాదులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుకోవాలన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుగా నిర్మించబడింది.
ఎన్నో పోరాటాల తరువాత కానీ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు కాలేదు. అలాంటి త్యాగాల పునాది మీద వచ్చిన స్టీల్ ప్లాంట్ ని ఏమీ కాకుండా ప్రైవేట్ చేసి పారేస్తామని బీజేపీ అంటోంది. దాంతో ఉక్కు కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఏపీలోని బీజేపీ తప్ప అన్ని పార్టీలు దాదాపుగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమే. అయితే ఇది అతి పెద్ద రాజకీయ ఉద్యమంగా మాత్రం ఇప్పటిదాకా రూపుదాల్చలేదు.
మరి విశాఖ రాహుల్ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద గర్జిస్తారు అంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఆ విధంగా రాజకీయంగా కాంగ్రెస్ కి ఊపిరులూదాలన్నది ఖద్దరు పార్టీ అజెండాగా ఉంది. మరి దీని మీద జన స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ప్రైవేటీకరణ మీద కాంగ్రెస్ మాట్లాడే పరిస్థితి ఉందా అని అపుడే బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అసలు ప్రైవేటు ని ప్రోత్సహించిందే కాంగ్రెస్ అని కూడా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాహుల్ తొందరలో విశాఖ వస్తున్నారు. మరి ఆయన టూర్ ఏమైనా ఏపీలో పార్టీకి కదలిక తెస్తుందా. జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేలా చేస్తుందా అన్నదే చూడాలి మరి.