కన్నా నిష్క్రమణం ముందు..వెనుక

యజమాని మనసు తెలిసి మసులు కొవడంలో గుర్రాన్ని మించినది లేదు అంటారు. గుర్రానికి యజమాని మూడ్ తెలుసుకునే శక్తి వుంటుందట. రౌత్ మూడ్ ఎలా వుంది అన్నది గ్రహించి, తదనుగుణంగా గుర్రం దౌడు తీస్తుందట.…

యజమాని మనసు తెలిసి మసులు కొవడంలో గుర్రాన్ని మించినది లేదు అంటారు. గుర్రానికి యజమాని మూడ్ తెలుసుకునే శక్తి వుంటుందట. రౌత్ మూడ్ ఎలా వుంది అన్నది గ్రహించి, తదనుగుణంగా గుర్రం దౌడు తీస్తుందట.

ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, పని చేసేవారు యజమాని మనసు తెలుసుకుని పని చేస్తే చిరకాలం పనిలో వుండే అవకాశం వుంటుంది, లేదూ అని తమంతట తాము వెళ్తే  భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా మాజీలు అయిపోవాల్సి వుంటుంది.

కన్నా రాకకు ముందు

భాజపా అధ్యక్షుడిగా కన్నా రావడానికి ముందు ఆంధ్ర రాష్ట్ర భాజపా మీద ఓ సామాజిక వర్గ పెత్తనం అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. తొలిసారి కాపు సామాజిక వర్గం చేతికి భాజపా పగ్గాలు వచ్చాయి. కన్నా ఈ విషయాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సి వుంది. ఆంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి దగ్గరగా రావడం కోసం తన చేతిలో పార్టీ పగ్గాలు పెట్టింది అధిష్టానం అన్న సంగతి ఆయన విస్మరించారు. 

ఈ ఒక్క పాయింట్ నే కాదు కన్నా విస్మరించింది. గతంలో తనను అణచివేయడానికి ఎవరు ఎంత కృషి చేసారు. అలాంటి టైమ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి అండగా నిలబడి, తనను ఏ విధంగా ఫైకి తీసుకువచ్చారు అన్నది కూడా మరిచిపోయారు. నిజానికి కన్నా భాజపా పగ్గాలు అందడానికి ముందు వైకాపాలోకి వెళ్లడానికి ట్రయ్ చేసింది వాస్తవం అని రాజకీయ వర్గాలు ఇప్పటికీ చెబుతాయి. సరే, ఎందుకో కుదరలేదు, ఈలోగా భాజపా సింహాసనం దక్కింది. అప్పటి వరకు రాష్ట్ర భాజపా మీద పెత్తనం చలాయించిన సామాజిక వర్గం పక్కన పడింది. 

కన్నా ఏం చేసారు?

2019 ఎన్నికల తరువాత కన్నా రూటు మారిపోయింది. ఎవరైతే గతంలో తనను తొక్కేద్దామనుకున్నారో ఆ వర్గం మనసు తెలుసుకుని ప్రవర్తించడం ప్రారంభించారు. తనను దగ్గరకు రానివ్వని వైకాపా అంటే మండి పడడం ప్రారంభించారు.  ఇక్కడ అసలు తనను ఎందుకు భాజపా అధ్యక్షుడిని చేసారు., అసలు భాజపా అధిష్టానం మనసులో ఏముంది? అన్నది తెలుసుకోలేకపోయారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల చేతుల్లో రెండు ప్రధాన పార్టీలు వున్నాయి కనుక, ఆంధ్రలో కాపులు బలమైన ఓటు బ్యాంక్ కనుక భాజపా కన్నా చేతిలో పార్టీ పగ్గాలు పెట్టింది. అప్పుడు కన్నా ఏం చేయాలి? ఆ రెండు ప్రధాన పార్టీలకు సమాన దూరం మెయింటెయిన్ చేయాలి.

ఇదే సమయంలో కేంద్ర భాజపా ఏమని అనుకుంటోంది. ఎప్పటికైనా ఆంధ్రలో అధికారం చేపట్టాలని అనుకుంటోంది. ఇప్పటికే తేదేపా కుదలేయింది. భాజపాకు మరో నాలుగేళ్ల వరకు మరీ బలమైన ఎజెండా ఏదీ ఆంధ్రలో లేదు. జగన్ ఏమీ తల ఎగరవేయడం లేదు. కేంద్రాన్ని నిలదీయడం లేదు. పైగా రాజ్యసభలో అండగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జగన్ ను కేంద్రం ఎందుకు టార్గెట్ చేస్తుంది. మహా అయితే నాలుగేళ్ల తరువాత ఆ పరిస్థితి రావచ్చు.

తొందరపడిన కన్నా

ఇలాంటి నేపథ్యంలో కన్నా తొందరపడ్డారు. వైకాపాను గట్టిగా టార్గెట్ చేస్తూ, తేదేపాకు ఊపిరులు ఊదే పనిలో పడ్డారు. ఇది కేంద్ర భాజపాకు ఎలా అంగీకారం అవుతుందని ఆయన అనుకున్నారో ఆయనకే తెలియాలి.  ఆ టార్గెట్ చేయడం కూడా మామూలుగా కాదు, ప్రధాన ప్రతిపక్షం కన్నా బలంగా, ప్రధాన ప్రతిపక్షానికి మరింత బలం చేకూర్చేలా.  పైగా అలా అని కన్నా మీద మచ్చలే లేవా అంటే, గడచిన ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన నిధులు తేడా చేసారని ఆరోపణలు వున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆయన మరింత జాగ్రత్తగా వుండాల్సింది పోయి, మరింత రెచ్చిపోయారు.

సామాజిక ఆశలు నీరుగారాయి

ఇలాంటి టైమ్ లో  కన్నా ముందు రాష్ట్ర భాజపా మీద పట్టు వుంచుకున్న సామాజిక వర్గం మళ్లీ తల పైకి లేపింది. కన్నాను పక్కకు తప్పించే అవకాశాలు వున్నాయని, పార్టీ వర్గాల నుంచి ఉప్పు అందడంతో, ఆ సామాజిక వర్గం కూడా యాక్టివ్ కావడం ప్రారంభమైంది.  కానీ కేంద్ర భాజపా చాలా సైలంట్ గా ఎవ్వరూ ఊహించని వేళ, ఊహించని విధంగా షాక్ ఇస్తూ,  మళ్లీ మరో కాపు నేతకు పార్టీ పగ్గాలు అందించింది. ఇలా చేయడం ద్వారా కేంద్ర భాజపా పలు విషయాలపై ఒకేసారి క్లారిటీ ఇచ్చినట్లు అయింది.

ఒకటి…కాపులకే భాజపాలో ప్రస్తుతానికి పెద్ద పీట వేస్తామన్నది. బిసి లు వైకాపా వెంట వున్నారు. కాపులను దగ్గరకు తీయాలని తేదేపా ప్రయత్నిస్తోంది. ఇలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్ తో పొత్తు, కాపులకు పార్టీ అధ్యక్ష పదవి అన్నవి తేదేపా ప్రయత్నాలకు గండి కొట్టిస్తాయి.

రెండవది. ఆంధ్ర భాజపాలో దశాబ్దాల కాలంగా హవా చలాయించిన సామాజిక వర్గానికి మరోసారి అలాంటి అవకాశం ఇచ్చే ఉద్దేశం అధిష్టానానికి లేదన్నది క్లారిటీ వచ్చేసింది.

మూడవది. ఇప్పట్లో వైకాపాను టార్గెట్ చేసే ఆలోచన భాజపాకు లేదన్నది.

సోము వీర్రాజుకు మార్గదర్శనం

ఇప్పుడు ఇవే కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు మార్గ దర్శక సూత్రాలు అనుకోవాలి. కన్నా చేసిన తప్పులు చేయకపోవడం, పార్టీ అధిష్టానం మనసు ఎరిగి ప్రవర్తించడం, కాపుసామాజిక వర్గం అండతో రాష్ట్రంలో పార్టీని బలోపేతంచ చేయడం వంటివి సోము వీర్రాజుకు మార్గదర్శకాలు.

ఫినిషింగ్ టచ్….సోము డైరక్ట్ ఎన్నికల్లో గెలవలేదని, తక్కవ ఓట్లు వచ్చాయని, ఇలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలా అన్నది ఎల్లో మీడియా కామెంట్. కానీ ఇదే ఎల్లో మీడియా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వెంకయ్య నాయుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి, సదా పరోక్ష ఎన్నికలే నమ్ముకున్నారని, ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా పని చేసారు.

లోకేష్ బాబు కూడా ప్రతక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన పార్టీ పదవిలో వున్నారు. మంత్రిగా పని చేసారు. వారితో పోల్చుకుంటే సోము వీర్రాజుకు ఏం తక్కువ? పాపం భాజపాలో తమ సామాజిక వర్గ హవా పోతోందనే బాధతో ఎల్లో మీడియా ఇలాంటి రాతలు రాసుకుని సంతృప్తి పడుతోందేమో?

చాణక్య
[email protected]