అవకాశం ఉన్న చోటల్లా తమవైన వ్యవహారాలను సాగించినట్టుగా ఉన్నారు జేసీ సోదరులు. ఈ విషయంలో ఆఖరికి దేవుడి మాన్యాలనూ వదల్లేదని స్పష్టం అవుతోంది. తాడిపత్రి సమీపంలోని పెద్దపప్పూరు వద్ద పప్పూరమ్మ మాన్యాలను కౌలుకు తీసుకుని, ఆ కౌలును మాత్రం కట్టకుండా జేసీ సోదరులు తమదైన రీతిలో వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ఈవో కూడా ధ్రువీకరించినట్టుగా సమాచారం. తక్షణం ఆ చెల్లింపులు చేయాలని ఈవో జేసీ సోదరులను కోరారట, అయితే చెల్లింపులు మాత్రం జరగలేదని భోగట్టా!
జేసీ సోదరులేమిటీ కౌలుకు తీసుకోవడం ఏమిటి? అంటే అదో పెద్ద వ్యాపారం! ఆలయ భూముల్లో వ్యవసాయ కళాశాలను నిర్వహిస్తోందట జేసీ కుటుంబం. అగ్రికల్చర్ కాలేజీకి భూములు కావాలంటే కొనుక్కోవాలి. అంత అవసరం లేకుండా.. దేవాదాయ శాఖ భూములను కౌలుకు తీసుకున్నారట! ఏడాదికి 9 వేల రూపాయల చొప్పున కౌలుకు మాట్లాడుకుని దేవాదాయ శాఖ నుంచి గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చుకున్నారట. ఆ స్వల్పమైన చెల్లింపులు కూడా చేపట్టనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆలయ ఈవో కూడా నిమ్మకు నీరెత్తారట. స్వల్పమైన మొత్తమే అయినా జేసీ సోదరులు ఎందుకు ఆ డబ్బులు చెల్లించలేదో మరి!
దేవుడి భూముల్లో విద్యా వ్యాపారం చేసుకుంటూ, కౌలు మాత్రం చెల్లించలేదట. ఇక జేసీ సోదరులకు సదరు ఈవో బాగా సన్నిహితుడని, అందుకే దేవుడి భూములపై కౌలును వసూలు చేయడానికి ఆయనకు మనసొప్పడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇదీ జేసీ సోదరుల బాగోతం అని, దేనికీ భయపడకుండా వాళ్లు తమ దందాలను సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.