బిగ్ బాస్ సీజన్ 4 పై ఉన్న డైలమాకి.. నాగార్జున ప్రోమో షూట్ తో తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 4 త్వరలోనే మొదలవుతుందనే విషయం పక్కా అని తేలింది. అయితే అది ఎప్పుడు? ముందే అనుకున్నట్టు ఆగస్ట్ చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ ఓపెన్ చేస్తారా? కంటెస్టెంట్ ల కరోనా టెస్ట్ రిజల్ట్ తో సీజన్-4 సీసీ కెమెరాల షూటింగ్ కి కొబ్బరి కాయ కొట్టేస్తారా? ఏమో, మళ్లీ అనుమానాలే.
కరోనా భయంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల సంఖ్య తగ్గుతుందని, బిగ్ బాస్ హౌస్ లో గడిపే రోజుల సంఖ్య కూడా తగ్గిస్తారని, వారానికి ఒకరోజే హోస్ట్ నాగార్జున వస్తారని, అది కూడా వీడియో కాల్స్ ద్వారానే కంటెస్టెంట్ లతో మాట్లాడతారని, గతంలో లాగా కలసి డ్యాన్స్ చేయడాలు, హగ్ లు ఇచ్చుకోడాలు ఉండవని తెలుస్తోంది. అయినా సరే అదంత ఈజీ కాదని అంటున్నారు కొంతమంది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేవారందరికీ కరోనా నెగెటివ్ అనే రిపోర్ట్ లు చూపించాలి. అంటే శ్వాబ్ శాంపిల్ టెస్ట్ కి ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చే వరకు కంటెస్టెంట్ లు ఎవర్నీ కలవడానికి వీలు లేదు. ఒకవేల ఈ గ్యాప్ లో వారికి కరోనా అటాక్ అయితే.. రిజల్ట్ నెగెటివ్ వచ్చినా.. రెండు రోజుల తర్వాత విషయం బైటపడుతుంది. దీని ద్వారా ఇతరులకు ముప్పే. అంటే బిగ్ బాస్ షో స్టార్ట్ కావడానికి ముందే వారందర్నీ క్వారంటైన్ లో ఉంచాలన్నమాట.
ఒకవేళ కీలక కంటెస్టెంట్ కరోనా బారిన పడితే అప్పుడేం చేస్తారు, అప్పటికప్పుడే ఆల్టర్నేట్ ఎలా చూస్తారు? పోనీ హౌస్ లోకి వచ్చిన తర్వాత.. వంటావార్పు, ఇతర వస్తువుల ద్వారా కరోనా వైరస్ లోపలికి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ముప్పు లేకుండా పోతుందా? పోనీ లోపల ఉన్న కంటెస్టెంట్ లకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్ద రాద్ధాంతం అవుతుంది, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు. ఖర్మకాలి కంటెస్టెంట్ లోపలికి వెళ్లాక కరోనా బారిన పడితే.. షో అర్థాంతరంగా ఆపేస్తారా లేక, పీపీఈ కిట్లతో కంటిన్యూ చేస్తారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ఇంకా నిర్వాహకుల్ని వేధిస్తున్నాయి.
అయితే ధైర్యం చేసి ఎలాగోలా ప్రోమో కట్ చేస్తున్నారని మాత్రం తెలుస్తోంది. ఈమాత్రం దానికి నాగార్జున ఒక్కరు ఉంటే సరిపోతుంది, అసలు ఎపిసోడ్ మొదలవ్వాలంటే.. కరోనా వారియర్స్ లాంటి టీమ్ కావాల్సిందే. అయితే రోజు రోజుకీ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కరోనా కేసుల సంఖ్య.. బిగ్ బాస్ నిర్వహకుల్ని కూడా డైలమాలో పడేస్తోంది. అన్నీ అనుకూలించి అప్పటికి కంటెస్టెంట్ లు అందరూ ఆరోగ్యంగా ఉంటే షో నడుస్తుంది, లేకపోతే.. ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.