కరోనా వైరస్ కు అంతం సాధ్యమేనా? ఒక మనిషి నుంచి మరో మనిషికి అది సోకకుండా నివారించవచ్చా? అనే అంశాల గురించి రకరకాల పరిశోధనలు సాగుతూ ఉన్నాయి. ఉన్న మార్గాలనే కాస్త అభివృద్ధి పరిచి కరోనాకు చెక్ పెట్టాలనే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో క్లోజ్డ్ హాల్స్ లో కరోనా వైరస్ ను అంతమొందించగల ఒక డివైజ్ ను ఆవిష్కరించినట్టుగా బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ప్రకటించింది. ఈ డివైజ్ కు సంబంధించి అమెరికన్, యూరోపియన్ ల నుంచి అప్రూవల్ కూడా వచ్చిందట. తమ డివైజ్ తో గాలిలో వ్యాపించిన కరోనా వైరస్ ను 99.9 పర్సెంట్ వరకూ నాశనం చేయవచ్చని ఆ సంస్థ చెబుతోంది.
ఆ డివైజ్ పేరు Shycocan- Scalene Hypercharge Corona Canon, చిన్న డ్రమ్ తరహాలో ఉంటుంది. దీన్ని గదుల్లోనూ, ఆఫీసుల్లోనూ, స్కూల్స్ లోనూ, ఎయిర్ పోర్ట్స్ లో, థియేటర్లలో..ఎక్కడైనా కాస్త క్లోజ్డ్ హాల్స్ లో బిగించుకోవచ్చట. బిగించేస్తే చాలు అది డిజ్ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుందనేది దీని తయారీ దారులు చెబుతున్నమాట. ఒకరకంగా ఎయిర్ ప్యూరిఫయర్స్ లా పని చేస్తుందేమో. ఇప్పటికే పెద్ద పెద్ద నగరాల్లో ఆఫీసుల్లో ఒక మూలన ఎయిర్ ప్యూరిఫయర్స్ పెడుతున్నారు. ఈ డివైజ్ కూడా ఆ తరహాలోనే పని చేస్తుందేమో.
దీని గురించి మరింతగా వివరిస్తూ.. కరోనా వైరస్ లో స్పైక్ ప్రొటీన్ లేదా ఎస్-ప్రొటీన్ ఉంటుందట, ఆ తరహా వైరస్ ను ఈ డివైజ్ నాశనం చేస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీని పనితీరును యూఎస్ఎఫ్డీయే ఆమోదించింది, ఈయూ నుంచి కూడా ఆమోదం లభించిందని, తాము రూపొందించిన ఈ డివైజ్ ను అంతర్జాతీయ స్థాయిలో తయారీకి తామే లైసెన్స్ లు ఇస్తున్నట్టుగా తయారీదారులు చెబుతున్నారు.
ఎవరైనా కరోనా రోగి దగ్గినా, తుమ్మినా వెలువడే కోవిడ్ -19 వైరస్ ను ఈ డివైజ్ అంతమొందిస్తుందని, సర్ఫేస్ ల మీద ఆ వైరస్ పడినా ఈ మిషన్ ధాటికి వైరస్ నశిస్తుందని వివరించారు. ఈ డివైజ్ ను మార్చిలోనే రూపొందించినట్టుగా అమెరికాలో ల్యాబ్ టెస్టింగులు జరిగాయని, ల్యాబ్ ఫలితాలు విజయవంతం అయ్యాయని.. వంద క్యూబిక్ మీటర్ల పరిధిలో వైరస్ ఈ డివైజ్ నశింపజేయగలదని చెబుతున్నారు.
సేఫ్టీతో సహా 26 రకాల పరీక్షల్లో ఇది విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. ఇండియాలో పలు సంస్థలు దీని మ్యానుఫ్యాక్ఛరింగ్ కు రెడీగా ఉన్నాయని, మూడు సంస్థలు లైసెన్స్ కూడా పొందాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగానే ఇలాంటి ప్రభావవంతమైన డివైజ్ లు అందుబాటులోకి వస్తే.. కరోనా వైరస్ పై విజయంలో అది అత్యంత కీలకమైనదే అవుతుంది.