అప్పుడే జగన్ ను నమ్మితే ఇప్పడీ పరిస్థితి వచ్చేది కాదు

బీజేపీ ఏపీ సారధిగా కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు పదవిలోకి వచ్చారు. వాస్తవానికి ఈ మార్పు చాలా ముందే జరగాల్సి ఉన్నా.. ఎందుకో కన్నాపై ఉన్న సాఫ్ట్ కార్నర్, ఏపీలో జనసేనతో దోస్తీ…

బీజేపీ ఏపీ సారధిగా కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు పదవిలోకి వచ్చారు. వాస్తవానికి ఈ మార్పు చాలా ముందే జరగాల్సి ఉన్నా.. ఎందుకో కన్నాపై ఉన్న సాఫ్ట్ కార్నర్, ఏపీలో జనసేనతో దోస్తీ వ్యవహారం ఆయనపై వేటు పడకుండా కొన్నాళ్లు కాపాడగలిగాయి. తీరా ఇప్పుడు సమయం రానే వచ్చింది, అధిష్టానం కన్నా భారాన్ని దించుకుంది. ఎమ్మెల్సీ అయినా కూడా సోము వీర్రాజుకి పార్టీ పదవి కూడా అప్పగించి చర్చకు తావిచ్చింది బీజేపీ అధిష్టానం.

అయితే ఈ ఎపిసోడ్ లో కన్నా లక్ష్మీనారాయణ బలిపశువు అయ్యారనే మాట మాత్రం వాస్తవం. గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయనకు గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ టికెట్ కూడా ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే అదే సందర్భంలో బీజేపీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి కాళ్లకు బంధం వేసింది.

ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత అయి ఉండి, జగన్ కింద ఎలా పనిచేస్తావంటూ కొంతమంది లేనిపోని గాంభీర్యాన్ని, అహాన్ని ఆయనకు అంటగట్టారు. వైసీపీలోకి వెళ్తే, జగన్ వెనక ఉండాల్సి వస్తుందని, బీజేపీలో కొనసాగితే ఏపీ మొత్తం చేతిలో ఉంటుందని రెచ్చగొట్టారు. ఇంకేముంది పాపం కన్నా.. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు.

అయితే ఆయన హయాంలో రాష్ట్రంలో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి స్థానంలో నర్సరావుపేట నుంచి లోక్ సభకు పోటీచేసి ఘోరంగా ఓడిపోయారాయన. నోటా కంటే కాస్త ఎక్కువగా ఓట్లు తెచ్చుకుని నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే వైసీపీలో చేరి ఉంటే, మంత్రి పదవి సంగతి దేవుడెరుగు కనీసం ఎమ్మెల్యేగా అయినా పక్కాగా గెలిచి ఉండేవారు. ఒకవేళ టికెట్ ఇవ్వడం కుదరకపోతే.. కచ్చితంగా ఈ దఫా రాజ్యసభలో కూర్చుని ఉండేవారు కన్నా.

ఇప్పుడు తలచుకుని ఏంలాభం. నిండా మునిగిన నావకు కెప్టెన్ గా కూడా ఉంచనీయకుండా తరిమేసింది కమలం పార్టీ. ఇప్పుడు బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ ఓ సాధారణ నాయకుడు మాత్రమే. జగన్ ని నమ్మక చెడిన నాయకుల్లో కన్నా ఒకరుగా మిగిలిపోయారు. ఇప్పటికైనా ఈ మాజీ మంత్రి వైసీపీ వైపు చూస్తారా లేక, బీజేపీపైనే నమ్మకం పెట్టుకుని వచ్చే ఎన్నికల గోదారి ఈదడానికి ప్రయత్నిస్తారా, ఈలోపు ఏదైనా రాజ్యాంగబద్ధ పదవితో కాలక్షేపం చేస్తారా.. వేచి చూడాలి.

త‌ప్పంతా నాదే…రోజా నాకు అక్క లాంటిది