టీడీపీ నేతలపై ఎన్ని కేసులు బనాయిస్తున్నా లోకేశ్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. పైగా అధికార పార్టీకి ఆయన డెడ్‌లైన్ విధించడం ఆసక్తికర పరిణామం. వైసీపీ అధికారంలోకి వచ్చి ఎన్నేళ్లైందో గుర్తు చేస్తూ…. తమపై రకరకాల అవినీతి ఆరోపణలు, కేసులు పెట్టి ఏం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిలదీస్తున్నారు.
తాజాగా స్కిల్ డెవలప్మెంట్ శాఖలో భారీ మొత్తంలో నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణపై ఈడీ 26 మందికి నోటీసులు ఇచ్చింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేయగా, లోకేశ్ మాత్రం వైసీపీకి సవాల్ విసరడం ఏంటో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. ఇవాళ లోకేశ్ వరుస ట్వీట్లలో వైసీపీపై తన సహజ ధోరణిలో విమర్శలు చేయడంతో పాటు డెడ్‌లైన్ విధించడం చర్చనీయాంశమైంది.
‘వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్ల 8 నెలలైంది. మీరు చెయ్యని విచారణ లేదు. నాతో పాటు చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేలిపోయింది. మేము మీలానే అవినీతికి పాల్పడి చిప్పకూడు తింటాం అనుకోవడం మీ అవివేకం. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్, ఐటి కంపెనీలు రాయితీలు, ఇలా అనేక అంశాలను తీసుకుని అవినీతి మరకలు అంటించారు. కానీ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ప్రజల్లో తన పాలనపై వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ దాన్ని పక్కదారి పట్టించేందుకు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి అంటూ నాపై కొత్త ఆరోపణలకు శ్రీకారం చుట్టారు. నాపై ఆరోపణలకు ముగింపు పలికేందుకు నేను సిద్ధం. ఇందుకోసం 24 గంటల సమయం ఇస్తున్నా. నాపై అన్ని ఆరోపణలకు ఆధారాలను వైసీపీ బయటపెట్టాలి. లేదంటే చేతులెత్తేసి ప్యాలెస్ పిల్లితో పాటు వైసీపీ పిల్లులు పారిపోతాయో 24 గంటలు వేచి చూద్దాం’ అంటూ లోకేశ్ ట్వీట్లు చేశారు.
లోకేశ్ సవాల్‌ను తీసుకుని వైసీపీ దోషిగా నిలబెడుతుందా? లేక రాజకీయ పరమైన ఆరోపణలకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు ఇస్తే, తమకెందుకు సవాల్ విసురుతున్నాడని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే నిర్దోషిగా నిరూపించుకోవాలనే చిత్తశుద్ధి నిజంగా లోకేశ్‌కు వుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా విచారణకు సిద్ధపడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడమే తప్ప, ఏమీ జరగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.