ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వంతు వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను వైసీపీ నేతలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటి వరకూ తెలంగాణలో అధికార పార్టీ నేతల వ్యాపార కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య అధికారం కోసం పోరు నడుస్తోంది. ఎలాగైనా ఈ దఫా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో నయాన్నో, భయాన్నో ప్రత్యర్థి పార్టీల నేతలను లొంగదీసుకునే క్రమంలో బీజేపీ కొంత వరకూ సక్సెస్ అయ్యింది.
చివరికి సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవితను కూడా తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటే, ఆ పార్టీ వ్యూహం ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. నేడో, రేపో కవిత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు అయ్యే అవకాశాలున్నాయి.
ఇదిలా వుండగా ఏపీలో కూడా ఐటీ దాడులు మొదలయ్యాయి. ఇప్పటికే టీడీపీ అనుకూల వైద్య కళాశాలలో, చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో భారీ అవినీతిపై ఈడీ సోదాలు, నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు సంబంధించి కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
విజయవాడ నగరంలోని అవినాష్ ఇంట్లో ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ స్థలానికి సంబంధించి లావాదేవీల వ్యవహారంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతల వ్యాపార కార్యకలాపాలపై కూడా ఐటీ కన్నేసిందని ఈ ఎపిసోడ్‌తో తెలిసొచ్చింది. దీంతో వైసీపీ వ్యాపారవేత్తలు అప్రమత్తం అవుతున్నారు.