దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల నుంచి మృతదేహాల్ని తీసుకెళ్లడానికే బంధువులు భయపడుతున్న పరిస్థితులివి. ఇలాంటి టైమ్ లో సినిమా థియేటర్లు తెరుస్తాం, జిమ్ లు ఓపెన్ చేస్తామంటూ కేంద్రం నుంచి ఓ కబురొచ్చింది. అన్ లాక్ -3లో ఈ నిబంధనలను సడలిస్తారని ఓ వర్గం తెగ ఆశపడుతోంది. అంతా బాగానే ఉంది కానీ.. కేంద్రం ఒప్పుకున్నా రాష్ట్రాలు ఏమాత్రం పట్టించుకునేట్టు లేవు.
లాక్ డౌన్ టైమ్ లో నిదానంగా పెరిగిన కేసులు, అన్ లాక్ -1 తర్వాత స్పీడందుకున్నాయి. అయినా సరే జననంచారానికి అనుమతి వచ్చేసింది. పరిమిత టైమ్ లో షాపులు తెరుచుకున్నాయి. పర్యవసానం.. కేసులు మరింతగా పెరిగాయి. అయినా మోడీ అన్ లాక్ -2 కి ఓకే చెప్పేశారు. ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చింది, ఆ దెబ్బతో కరోనా కేసులు జెట్ స్పీడ్ అందుకున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలకు చేరుకుంటోంది. మరణాల సంఖ్య 32 వేలు దాటింది. ఈ దశలోకూడా ప్రధాని తన కామెడీ ఆపలేదు. అన్ లాక్ -3 కి కసరత్తులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా సినిమా థియేటర్లు తీసేందుకు అనుమతులిస్తారట. జిమ్ లు, పబ్లిక్ పార్క్ లపై ఉన్న నిబంధనలు కూడా తొలగిస్తారట. కేంద్రం ప్రతిపాదనలు బాగానే ఉన్నా.. కేసులు సంఖ్య తగ్గకపోవడం, మరణాల సంఖ్య పెరగడం వంటివి ఆందోళన కలిగించే విషయాలు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రం పరిస్థితీ ఇందుకు మినహాయింపు కాదు.
మోడీ ఇస్తున్న అన్ లాక్ షాక్ లతో ఇప్పటికే రాష్ట్రాలు తీవ్రంగా అప్రతిష్ట మూటగట్టుకుంటున్నాయి. దీంతో జిల్లాల కలెక్టర్లపైనే ప్రభుత్వం కూడా భారం వేసింది. ఏపీలోని 13 జిల్లాల్లో.. పదింట కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం వంటి చోట్ల దాదాపు లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలిదశ లాక్ డౌన్ టైమ్ లో ఎలాంటి ఆంక్షలున్నాయో.. ఇప్పుడు కూడా అవే అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులు తెరవనీయడంలేదు, రోడ్లపై కూడా పోలీసులు పహారా కాస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో సినిమాలు, కసరత్తులు అంటే రాష్ట్రాలూ ఊరుకుంటాయా? సినిమాహాళ్లు తెరిస్తే జనం ఎలా రియాక్ట్ అవుతారనే విషయం పక్కనపెడితే, జనం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్థానికంగా అనుమతులివ్వడానికి ఓ పట్టాన ఒప్పుకోవు. అంటే కేంద్రం ఎంత రెచ్చగొట్టి రాష్ట్రాలు నష్టపోడానికి సిద్ధంగా లేవన్నమాట. మొహమాటం కోసమైనా అన్ లాక్ -3ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లక్ష్యపెట్టకపోవచ్చు. ఇక మిగతా రాష్ట్రాలు అసలు అన్ లాక్-3ని పట్టించుకోకపోవచ్చు.