నలుగురిలోనో, స్నేహితుల మధ్యనో, బంధువుల్లోనో, సమవయస్కుల మధ్యనో… మీకు అదనపు గౌరవం దక్కుతుందా? లేదా అంతా తేలికగా తీసుకోబడే వ్యక్తి అవుతున్నారా! సాధారణంగా ఇలాంటి గౌరవాలు, గుర్తింపులు.. సాధించిన సక్సెస్ ను బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని, సంపాదనను, ఆర్థిక శక్తిని బట్టి దక్కుతూ ఉంటాయి! మరి అలాంటి సక్సెస్ ఫుల్ అనిపించుకోవాలంటే కొన్ని నిఖార్సైన అలవాట్లు కూడా ఉండాలి.
ఎలాంటి సక్సెస్ ను సాధించిన వారిలో అయినా కొన్ని సవ్యమైన అలవాట్లు ఉంటాయి. అలాంటి అలవాట్లను కలిగి ఉంటే.. సక్సెస్ సొంతం అవుతుంది. సొంతమైన సక్సెస్ తో సర్వత్రా గుర్తింపు, గౌరవం దక్కుతుంది! ఇలా చూస్తే.. కొన్ని రకాలైన అలవాట్లు అందరి మధ్యనా గుర్తింపును, గౌరవాన్ని పెంపొందిస్తాయి. అవేంటో ఒక సారి పరిశీలిస్తే…
లేటుగా నిద్రలేచి ఎరగరు!
దశాబ్దాలుగా సూర్యుడెప్పుడూ తనను బెడ్ మీద చూసి ఎరగడని చెప్పాడో ప్రపంచ ధనికుడు! సక్సెస్ ఫుల్ పీపుల్ ఎవ్వరూ ఎనిమిది గంటల పాటు నిద్రపోరు అని చెప్పాడు మరో ప్రఖ్యాత వ్యక్తి! సమాజంలో గౌరవమర్యాదలు పొందే చాలా మంది వ్యక్తులు, మనుషుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వారు కూడా తెల్లవారుఝామునే తమ వృత్తిగత పనులను ప్రారంభిస్తారనే విషయం కూడా తరచూ వినిపిస్తూ ఉంటుంది. మరి తెల్లవారుఝామునే లేవడం అనేది ఎంత గొప్ప అలవాటో అర్థం చేసుకోవడానికి అలాంటి వారి ఉదాహరణలు సరిపోతాయి. తెల్లవారుఝుమానే లేచి అనుకున్న పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవడంతో రోజులో మరింతగా పని చేసుకోవడానికో, కష్టపడటానికో సమయం అదనంగా దొరికినట్టే. విద్యాభ్యాసానికో, నైపుణ్యాభివృద్ధికో తెల్లవారుఝామునే లేచి శ్రమించడం నిస్సందేహంగా గొప్ప అలవాటు. గొప్ప గౌరవం పొందడానికి దారి చూపే అలవాటు ఇది.
వార్తలు చదువుతారు!
చదవడం నిస్సందేహంగా గొప్ప అలవాటు. పుస్తకాలు చదివేంత సమయం లేకపోయినా, సక్సెస్ ఫుల్ పీపుల్ చాలా మంది రోజుకో అరగంట అయినా వార్తా పత్రికలు చదువుతారనేది పరిశీలనలు చెబుతున్న అంశం. రోజుకో అరగంట పత్రికలను చదివితే చుట్టూ ఏం జరుగుతోంది, కనీసం తాము పని చేస్తున్న రంగంలో ఏం జరుగుతోందో అయినా అర్థం అవుతుంది. ఈ ప్రపంచ జ్ఞానం వ్యక్తిగత, వృత్తిగత స్థాయిని కూడా పెంపొందిస్తుంది. నిస్సందేహంగా గౌరవాన్ని పెంచుతుంది.
గోల్స్ ను చేజ్ చేస్తారు!
సక్సెస్ ఫుల్ పీపుల్ గా సమాజంలో గౌరవమర్యాదలను పొందే ఎంతో మంది తమ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ పట్ల పూర్తి క్లారిటీతో ఉంటారు. తమ వరకూ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ ను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కఠినంగా శ్రమిస్తూ ఉంటారు.
టైమ్ వేస్ట్ చేయరు!
ఒక్కసారి ఇన్ స్టాగ్రమ్ రీల్స్ ను చూడటం మొదలుపెడితే, గంటలైనా అలాగే గడిచిపోతాయి! ఫేస్ బుక్, యూట్యూబ్ లలో చూడటానికి వేల కొద్దీ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. కాసేపు అనుకుని వీటిని చూడటం మొదలుపెట్టినా.. గంటల తరబడి వీటితోనే సమయం గడిచిపోతుంది కూడా! జనాలకు ఇది బాగా అలవాటైన అంశం ఇది. మరి సక్సెస్ ఫుల్ పీపుల్ మాత్రం ఇలాంటి వాటినే కట్టిపెడతారు. టైమ్ ను కన్జ్యూమ్ చేసే ఈ అలవాట్ల కన్నా, ప్రొడక్టివ్ వర్క్ కు ప్రాధాన్యం ఇస్తారు. ఇంటర్నెట్ లో టైమ్ పాస్ వీడియోలు చూడటం కూడా వ్యసనంగా మారిన ప్రస్తుత తరుణంలో ఇదొక వ్యర్థవ్యసనం అని గుర్తెరగాలి!
అందరితోనూ సత్సంబంధాలు!
పనికిరాని విషయాలను మాట్లాడుతూ అందరికీ సమయం కేటాయించలేకపోయినా.. నవ్వుతోనో, పలకరింపుతోనో.. ఫ్రెండ్లీగా వ్యవహరించడం మాత్రం గౌరవింపబడే వారికి ఉన్న అలవాటే. చుట్టూ ఉన్న వారితో సానుకూల ధోరణితో వ్యవహరించడం నిస్సందేహంగా గౌరవాన్ని పెంపొందించే అంశమే.