గుజరాత్ ఫలితాల తరువాత

గుజరాత్ ఎన్నికల మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. మరోసారి అక్కడ భాజపా ప్రభుత్వమే ఏర్పడబోతున్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసాయి. ఇది పెద్దగా ఆశ్చర్య పరిచే సంగతి కాదు కానీ దేశ రాజకీయాల్లో…

గుజరాత్ ఎన్నికల మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. మరోసారి అక్కడ భాజపా ప్రభుత్వమే ఏర్పడబోతున్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసాయి. ఇది పెద్దగా ఆశ్చర్య పరిచే సంగతి కాదు కానీ దేశ రాజకీయాల్లో కాస్త ప్రభావం వుంటుందన్నది వాస్తవం. ప్రజల దగ్గర నుంచి కీలక సమయాల్లో మద్దతు లభించిన ప్రతిసారీ భాజపా దూకుడు అన్నది కామన్ పాయింట్. దేశం మొత్తం మీద కొంత శాతం ఓటర్లు అయినా గుజరాత్ లో భాజపా ఓటమి కోరుకున్నారు. అందులో రకరకాల పార్టీల జనాలు వుండొచ్చు. కానీ కేవలం మోడీ-అమిత్ షా విధానాలు నచ్చకపోవడం అన్నదే వీరందరినీ కలిపే కామన్ పాయింట్.

తెలుగునాట రాజకీయ నాయకుల్లో కూడా ఇలాంటి జనాల శాతం కొంత వుంది. అలాంటి వారి పట్ల మోడీ-షా ద్వయం గుజరాత్ ఎన్నికల తరువాత దూకుడుగా వుండొచ్చు అనే భావన వుంది. ముఖ్యంగా తెలంగాణలో ఇది స్పష్టంగా కనిపించే అవకాశం వుంది. మద్యం కేసు పర్యవసానాలు కాస్త కటువుగా మారే అవకాశం వుంది. తమ మీద కాలు దువ్వే వారిని మోడీ-షా అస్సలు ఉపేక్షించరు. తెలుగునాట ఈ అనుభవం ఇప్పటికే చంద్రబాబు కు వుంది. అందుకే ఒకసారి ఆ అనుభవం కలిగిన తరువాత అన్ని విధాలా సైలంట్ గా వుండిపోయారు ఆయన. అంతే కాదు తనకు వున్న అన్ని మార్గాలు వాడుతూ మోడీ-షా లకు దగ్గర కావాలని ప్రయత్నిస్తూనే వున్నారు. ఆ ఫలితాలు కొంత వరకు ఫలించి, కొన్ని నెలల క్రితం ఓ మీడియా అధినేత ఇంటి నుంచి అమిత్ షా తో జూమ్ కాల్ మాట్లాడారని కూడా వార్తలు వినిపించాయి.

అందుకే గుజరాత్ ఎన్నికల తరువాత జగన్ పట్ల మోడీ-షా కాస్త కటువుగా వ్యవహరిస్తారని తెలుగుదేశం అనుకూల వర్గాలు ఆశగా వున్నాయి.  కానీ ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి వుంది. జగన్ ఏమీ కేసీఆర్ మాదిరిగా బలంగా లేరు. జగన్ మీద కేసులు వున్నాయి. జగన్ పాలన సజావుగా సాగడానికి కేంద్రం అండ తప్పనిసరి అవసరంగా వుంది. ఇవన్నీ కొత్త విషయాలు కావు. గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం ఆగేంత సీన్ అయితే కాదు. కేసీఆర్ విషయంలో ఎన్నికల ఫలితాల వరకు ఆగే అవకాశం, అవసరం వుంటుదేమో కానీ జగన్ విషయంలో అయితే కచ్చితంగా కాదు. అందవల్ల జగన్ – మోడీ బంధం మీద గుజరాత్ ఎన్నికల ప్రభావం వుంటుంది అని ఆశించడం అనేది దింపుడు కళ్లం ఆశ తప్ప మరేమీ కాదు.

అయితే ఆంధ్ర రాజకీయాల మీద మరో విధంగా ప్రభావం కనబర్చవచ్చు. వైకాపా మీద పోరాటానికి తమకేమీ కేంద్రం పర్మిషన్ అవసరం లేదు..మోడీని అడగాల్సిన పని లేదు అని ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ పలుకులకు కాస్త కళ్లెం పడొచ్చు. భాజపాను తన దారిలోకి తెచ్చి, తేదేపా దిశగా నడిపించాలన్న జనసేనాధిపతి ఆశలకు కాస్త బ్రేక్ పడొచ్చు. భాజపా ఫోల్డ్ నుంచి బయటకు వచ్చేయాలి అవసరం అయితే అనే జనసేన ఆలోచనలకు అడ్డం పడొచ్చు.

అదే సమయంలో మోడీ విజయాన్ని చంద్రబాబు అభినందించాల్సి రావచ్చు. ఆంధ్రకు మోడీ ఏమీ చేయడం లేదనే విమర్శను తెలుగుదేశం అను’కుల’ సామాజిక మీడియా పదే పదే చేస్తోంది. అలాంటి మోడీ విజయాన్ని చంద్రబాబు అభినందించడాన్ని సదరు మీడియా ఏ విధంగా తీసుకుంటుంది అన్నది కూడా చూడాలి. ఆ మీడియా ఎలా తీసుకున్నా జనం అప్పుడు ఈ విషయంలో జగన్ ను మాత్రం తప్పడం సరికాదని అనుకోనూ వచ్చు. మోడీ-షాల పవర్ సెంటర్ అలాంటిది అన్న అవగాహన మరింత పెరుగుతుంది.

మొత్తం మీద మరోసారి మోడీ చరిష్మా గుజరాత్ లో వర్కవుట్ కావడం అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మీద కన్నా తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం కనబర్చే ప్రమాదం అయితే వుంది. ఎందుకంటే మోడీకి కేసీఆర్ అన్నా అరవింద్ కేజ్రీవాల్ తో తలకాయనొప్పి ఎక్కువ. అందువల్ల ఆప్ తో సంబంధాలున్న మద్యం కేసును మరింతగా బిగించవచ్చు. ఆ బిగింపులో కేసీఆర్ పార్టీ కూడా ఇరుక్కోవడం అన్నది తప్పనిసరి పర్యవసానం కావచ్చు.

చూస్తుంటే రాబోయే కొద్ది కాలం రాజకీయాలు రంజుగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.