హిమాచ‌ల్ లో బీజేపీ బేర‌సారాలు చేయాల్సిందేనా!

త‌గినంత మంది ఎమ్మెల్యేల బ‌లం లేక‌పోయినా, చీలిక‌లు- పేలిక‌లతో, ఉన్న ప్ర‌భుత్వాల‌ను కూల్చి.. ర‌చ్చ‌ర‌చ్చ చేసి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం క‌మ‌లం పార్టీకి కొత్త కాదు. గ‌త ఎనిమిదేళ్ల‌లో ఇలాంటి అనుభ‌వాల‌ను ఎన్నింటినో…

త‌గినంత మంది ఎమ్మెల్యేల బ‌లం లేక‌పోయినా, చీలిక‌లు- పేలిక‌లతో, ఉన్న ప్ర‌భుత్వాల‌ను కూల్చి.. ర‌చ్చ‌ర‌చ్చ చేసి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం క‌మ‌లం పార్టీకి కొత్త కాదు. గ‌త ఎనిమిదేళ్ల‌లో ఇలాంటి అనుభ‌వాల‌ను ఎన్నింటినో సంపాదించింది బీజేపీ. అస‌లు త‌మ ఉనికే లేని చిన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఈ త‌ర‌హాలో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసింది. ఇక బోటాబోటీ మెజారిటీలు ద‌క్కిన చోట అయితే క‌మ‌లం పార్టీ ప్ర‌త్య‌ర్థికి అవ‌కాశం ఇవ్వ‌దు. కాంగ్రెస్ కు కాస్త మెజారిటీ ద‌క్కిన చోట కూడా ఎమ్మెల్యేల‌ను చీల్చి ఆ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డం బీజేపీకి ఇప్పుడు క‌ర‌త‌లామ‌ల‌కం!

మ‌రి చూస్తుంటే.. హిమాచ‌ల్ లో బీజేపీ ఇలాంటి క‌స‌ర‌త్తే సాగించాల్సి ఉందంటున్నాయి ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు. గ‌త నెల 12 వ తేదీన హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌గా, గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిట్ పోల్స్ కానీ, అస‌లు ఫ‌లితాలు కానీ వెల్ల‌డి కాకుండా చూశారు! ఇప్పుడు గుజ‌రాత్ అసెంబ్లీ పోలింగ్ పూర్తి కావ‌డంతో హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల అయ్యాయి.

వీటి ప్ర‌కారం.. హిమాచ‌ల్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాట‌బోతోంది. కొన్ని ఎగ్జిట్ పోల్ స‌ర్వేల‌ ప్ర‌కారం అయితే కాంగ్రెస్ కే అక్క‌డ మెజారిటీ ద‌క్క‌నుంది కూడా! 68 అసెంబ్లీ సీట్లున్న ఈ బుల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ కు 40 సీట్ల వ‌ర‌కూ గ‌రిష్టంగా ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ఒక ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచ‌నా వేసింది. బీజేపీ గెలుస్తుంద‌ని చెబుతున్న స‌ర్వేలు కూడా ఆ పార్టీకి బోటాబోటీ మెజారిటీ మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని అంచ‌నా వేస్తున్నాయి.

మ‌రి అదే ప‌రిస్థితి వ‌స్తే బీజేపీ వ్య‌వ‌హారాన్ని తేలిక‌గా అయితే వ‌ద‌ల‌దు! త‌మ‌కు అస‌లే మాత్రం బ‌లం లేని చోట కూడా ఎమ్మెల్యేల‌ను అటుమార్చి, ఇటు మార్చి బీజేపీ త‌న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాంటిది మెజారిటీకి తాము కాస్త‌దూరంలో ఆగిపోయినా, కాంగ్రెస్ కు కాస్త మెజారిటీ ద‌క్కినా.. బీజేపీ విన్యాసాలు దాని స్టైల్లోనే ఉండ‌టంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. కాంగ్రెస్ కు సీట్లెన్ని వ‌చ్చినా.. ప్ర‌భుత్వం ఏర్ప‌రిచేది మాత్రం బీజేపీనే కావొచ్చు అని కూడా ఎగ్జిట్ పోల్ విశ్లేష‌ణ‌లో ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సిన అంశం!