స‌న్యాసం స్వీక‌రించిన వైసీపీ సీనియ‌ర్ నేత‌

వైసీపీ సీనియ‌ర్ నేత‌,  మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌కాలికుడైన డాక్ట‌ర్ వ‌డ్డెమాను శివ‌రామ‌కృష్ణారావు ఆధ్యాత్మిక చింత‌న‌తో స‌న్యాసం స్వీక‌రించారు. నిన్న రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్ వ‌ద్ద ఆయ‌న వేద‌మంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా…

వైసీపీ సీనియ‌ర్ నేత‌,  మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌కాలికుడైన డాక్ట‌ర్ వ‌డ్డెమాను శివ‌రామ‌కృష్ణారావు ఆధ్యాత్మిక చింత‌న‌తో స‌న్యాసం స్వీక‌రించారు. నిన్న రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్ వ‌ద్ద ఆయ‌న వేద‌మంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా స‌న్యాసం స్వీక‌రించారు. బ్రాహ్మ‌ణుడైన ఆయ‌న ఇక‌పై శివరామానంద సరస్వతిగా ఆధ్యాత్మిక ప్ర‌స్థానాన్ని కొన‌సాగించ‌నున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత స‌న్యాసం స్వీక‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించారు. శివ‌రామ‌కృష్ణారావు కుటుంబం గ‌త ఆరు ద‌శాబ్దాలుగా బ‌ద్వేలులో క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఉంటోంది. శివ‌రామ‌కృష్ణారావు తండ్రి వ‌డ్డెమాను చిదానందం ఉమ్మ‌డి మ‌ద్రాస్ రాష్ట్రంలో బ‌ద్వేలు నుంచి 1952లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి గెలిచారు. ఆ త‌ర్వాత 1962లో కూడా ఆయ‌న ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా గెలుపొందారు. దీన్నిబ‌ట్టి వ‌డ్డెమాను కుటుంబానికి బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

తండ్రి వార‌స‌త్వంగా డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణారావు రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. మొట్ట మొద‌టిసారిగా 1978లో జ‌న‌తాపార్టీ త‌ర‌పున ఆయ‌న గెలుపొందారు. ఇదే స‌మ‌యంలో క‌డ‌ప జిల్లా పులివెందుల నుంచి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, మైదుకూరు నుంచి డాక్ట‌ర్ డీఎల్ ర‌వీంద్రారెడ్డి గెలుపొందారు. ఒకే స‌మ‌యంలో ఒకే జిల్లా నుంచి ముగ్గురు యువ డాక్ట‌ర్లు ఎన్నిక కావ‌డం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. రాష్ట్ర‌స్థాయిలో ఈ ముగ్గురు యువ ఎమ్మెల్యేలు ప్ర‌త్యేక గుర్తింపు పొందారు.

మొత్తం ఐదుసార్లు బద్వేలు నుంచి పోటీ చేసిన డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణారావు రెండుసార్లు గెలుపొందారు. దివంగ‌త వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందారు. 2009లో బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కావ‌డంతో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. వైఎస్సార్ అకాల మ‌ర‌ణంతో డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణారావు షాక్‌కు గుర‌య్యారు. రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా పెద్ద దిక్కు కోల్పోయిన ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపించింది.

వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న  కాంగ్రెస్‌లోనే కొనసాగారు.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఎపి స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు..

మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో విలువ‌లు అడుగంటుతున్నాయ‌ని ఆయ‌న త‌ర‌చూ ఆవేద‌న వ్య‌క్తం చేసేవారు. గ‌తం కాలం నాటి  విలువలు, మానవత్వం, విశ్వసనీయత ఇప్పడు మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని,  స్వార్ధ రాజకీయాలు రాజ్య‌మేలుతున్నా య‌ని, తాను ఇమ‌డ‌లేక‌పోతున్నాన‌ని వేద‌న చెందేవారు.  ఈ క్ర‌మంలో ఆయ‌న ఆధ్యాత్మిక చింత‌న వైపు ఆలోచ‌న‌లు ప్ర‌యాణించాయి.

ఈ నేప‌థ్యంలో  దేశ, విదేశాల్లోని ప్రముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలను ఆయ‌న తరచూ సందర్శిస్తూ వచ్చారు.. మానస సరోవర్, ఛార్ ధామ్ యాత్ర, అమరనాథ్‌ యాత్ర తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రుషికేశ్ లోని గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. గత మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్శితులైన శివరామకృష్ణా రావు ఎట్టకేలకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా గురువారం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి ఆధ్వర్యంలో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఇకపై ఆయన శ్రీ శివరామానంద సరస్వతిగా కొనసాగుతారు. స‌న్యాసం స్వీక‌రిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న వెంట మాజీ డీజీపీ అర‌వింద‌రావు ఉన్నారు. 

అనంత‌రం సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఆయ‌న్ని క‌లిశారు. డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణారావుకు ఒక కుమారుడు ఉన్నాడు. క‌డ‌ప రిమ్స్‌లో డెంటిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. శివ‌రామ‌కృష్ణారావు కుమారుడికి ఇద్ద‌రు కూతుళ్లు. మొత్తానికి రాజ‌కీయంగా అనేక ఆటుపోట్ల‌ను ఎదుర్కొని ప్ర‌త్యేక గుర్తింపు పొందిన డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణారావు …జీవిత చివ‌రి మ‌జిలీని ఆధ్మాత్మిక‌త‌తో ముగించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది.