మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు యలవర్తి ఆనంద కిశోర్ అలియాస్ నలంద కిశోర్ మృతి రాజకీయ రంగు పులుముకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా రాజకీయం కాకుంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులున్నాయి. నలంద కిశోర్ గుండె పోటుతో మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
బాధిత కుటుంబ సభ్యులు, మృతుడికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఇదే అదనుగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ మాత్రం రాజకీయ విమర్శలు చేసి తమ నైజాన్ని చాటుకున్నారు.
వైసీపీ వేధింపులు తాళలేక కిశోర్ మృతి చెందాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారనే కారణంతో ఆయనపై కేసులు బనాయించారని ఆరోపించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కిశోర్‌ను రోడ్డు మార్గంలో విశాఖ నుంచి కర్నూలుకు సుదీర్ఘ దూరానికి తీసుకెళ్లారన్నారు. పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా అతన్ని హింస పెట్టారని ఆరోపించారు.
ఇక శవ రాజకీయాలు చేయడంలో లోకేశ్ తండ్రికి మించిన తనయుడని నిరూపించుకున్నారు. కిశోర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లోకేశ్ ఆరోపించారు. కిరోశ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మరణం ఎవరిదైనా బాధాకరమే. ప్రత్యర్థులైనా ఎవరూ చావు కోరుకోరు. కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడంలో అబ్బాకొడుకులు ఆరితేరారు. ఇంకా నయం మృతుడు ఏ బీసీనో, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తో కానట్టున్నారు. లేకపోతే ఈ పాటికి కులాన్ని కూడా జోడించి రాజకీయాన్ని రక్తి కట్టించేవాళ్లు.
ఇదిలా ఉంటే సన్నిహితుడి మృతిపై గంటా శ్రీనివాసరావు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం ప్రాధాన్యం సంతరించుకొంది. సన్నిహితుడి మృతి వార్త తెలియగానే హుటాహుటీన గంటా కూడా అక్కడికి వెళ్లారు. కోవిడ్ నేపథ్యంలో మృతదేహాన్ని దగ్గరగా చూసే అవకాశం లేకపోవడంతో గంటా శ్రీనివాసరావు కన్నీటిపర్యంతమయ్యారు. 25 ఏళ్ల తమ స్నేహాన్ని గుర్తు చేసుకుని గంటా విలపించడం చూపరులను కంట తడిపెట్టించింది.
త్వరలో వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్నిహితుడి మృతిపై పాలక పార్టీ కారణమని విమర్శలు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ అధికార పార్టీపై విమర్శలు చేస్తుంటే, అత్యంత సన్నిహితుడైన గంటా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనంతటికి కారణం వైసీపీలో చేరేందుకు అవరోధం ఏర్పడకూడదనే భావనే అని సమాచారం.