తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఐటీ, ఈడీ, సీబీఐ వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ నేతల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఏపీలో కూడా ఈడీ దాడులు పెరిగాయి. చంద్రబాబు పాలనలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.241 కోట్ల అవినీతికి సంబంధించి ఈడీ ఆధారాలు సేకరించింది.
భారీ మొత్తాన్ని దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. ఆ శాఖలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయ్యినట్టు చెబుతున్నారు. దీంతో కుంభకోణంలో భాగస్వాములైన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ దుమారానికి దారి తీసింది.
2014-19 మధ్య కాలంలో జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.3,500 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం చేసుకుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం మొత్తం రూ.370 కోట్లు. ఈ మొత్తంలో రూ.241 కోట్లు దారి మళ్లినట్టు ఆడిటింగ్‌లో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ, ఓఎస్‌డీ కృష్ణప్రసాద్‌తో పాటు మరికొందరికి ఈడీ నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరగనుందో చూడాలి.