టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయేకాలం వచ్చింది. చంద్రబాబుకి 23 కంటే ఇంకా తక్కువ స్కోరు చూసే రాత రాసిపెట్టి ఉంది. నిన్న జరిగిన సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాల జారీ కార్యక్రమం చూసిన ఎవరికైనా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ప్రతి జిల్లాలో నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులు జీవితాంతం జగన్ కి రుణపడి ఉంటామనే విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ చెప్పేశారు.
ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రవేశపెట్టి దివంగత నేత వైఎస్సార్ తమకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పిస్తే.. ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే తమకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు చేతిలో పెట్టారని, ఇది మరచిపోలేని మధురానుభూతి అని అన్నారు సచివాలయ ఉద్యోగాలు సంపాదించిన అభ్యర్థులు. తండ్రి చదివిస్తే, తనయుడు ఉద్యోగాలిచ్చాడని.. వారిని, వారి కుటుంబాన్ని జన్మలో మర్చిపోమని భావోద్వేదానికి గురయ్యారు.
అదే సమయంలో ప్రతి ఉద్యోగిలో కొంత అసంతృప్తి కనిపించింది. ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని, రాజకీయ సిఫార్సులతో ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యారని వస్తున్న విమర్శలతో చాలామంది మానసికంగా ఇబ్బంది పడినట్టు కనిపించింది. నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులు ఈ అంశంపై బహిరంగ వేదికపైనే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. తాము పడిన కష్టం తమ మనస్సాక్షికి తెలుసని, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే, సిఫార్సులంటూ తమ మనస్సులను గాయపరిచారని, అలాంటి నిందలు వేసిన పార్టీని, ఆ పార్టీ పెద్ద మనిషిని, వారి వెనకున్న మీడియాని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని వేదికలపైనే చెప్పారు.
సహజంగా ఉద్యోగులెవరూ ఏ రాజకీయ పార్టీకీ మద్దతుగా మాట్లాడరు, మరో పార్టీని బహిరంగంగా విమర్శించరు. కానీ సచివాలయ ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులు మాత్రం టీడీపీ తమను మానసికంగా వేధించిందంటూ బహిరంగంగానే చెప్పారు. తమను అవమానించి, తమ కష్టాన్ని కించపరిచిన చంద్రబాబుని తాము జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని శాపనార్థాలు పెట్టారు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల పేరు పెట్టిమరీ బాబుని తిట్టిపోస్తే.. మరికొన్ని చోట్ల ఉద్యోగ ప్రక్రియ ఎక్కడ నిలిచిపోతుందో అని తాము పడ్డ బాధని చెప్పుకుంటూ అభ్యర్థులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
ఈ శాపాలన్నీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ స్కోర్ ని మరింత తగ్గించే అవకాశముంది. లక్షా 30వేల కుటుంబాల మానసిక వేదన టీడీపీకి తగులుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికితోడు ఇకపై ప్రతిఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుందని, అంతా ప్రిపరేషన్ లో మునిగిపోవాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునివ్వడం యువతలో ఉత్సాహం నింపింది. క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో నిరుద్యోగుల ఆనందానికి అవధుల్లేవు.