వివాదాస్పద , సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను డైరెక్ట్‌గా టార్గెట్ చేసే దమ్ము పవన్‌కల్యాణ్ అభిమానులకు లేదా? అంటే లేదనే సమాధానం వస్తుంది. “పవర్‌స్టార్” పేరుతో వర్మ పవన్‌కల్యాణ్‌ను నేరుగా టార్గెట్ చేసి సినిమాను తెరకెక్కించి విడుదల కూడా చేశారు. తమ అభిమాన పవర్‌స్టార్‌తో పాటు మరికొందర్ని కించపరిచేలా సినిమా తీసిన వర్మను నేరుగా ఎదుర్కోడానికి పవన్ అభిమానులుగా చెప్పుకునే సెలబ్రిటీలకు దమ్ము, ధైర్యం లేదనే వాదన తెరపైకి వస్తోంది.
హీరో నిఖిల్‌కు పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి ప్రేమ. తన అభిమాన హీరో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమా తీసిన వర్మను ఉద్దేశించి మూడు రోజుల క్రితం నిఖిల్ ఓ ట్వీట్ చేశారు. ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా’ అంటూ నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వర్మను నేరుగా టార్గెట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో నిఖిల్‌కే తెలియాలి.
తాజాగా అలాంటిదే మరో ట్వీట్ చూద్దాం. ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ కూడా వర్మపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ మంచి స్నేహితులు. ‘పవర్‌స్టార్’ ట్రైలర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను అవమానించే సీన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై నాగవంశీ తన స్టైల్లో ట్వీట్ చేశారు.
‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా? ఈ రోజుల్లో సెన్సేషనలిజమ్ అనేది సాధారణంగా మారిపోయింది. తమ మను గడ కోసం ఇతరుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే రాబంధులు ఎక్కువైపోయాయి. ఇలాంటి వారికి సిగ్గు ఉండదు. వారితో పోరా టం చేయడానికి ఏకైక మార్గం వారిని పట్టించుకోకపోవడమే’ అని నాగవంశీ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా అంటూ ‘అరవింద సమేత’లో ఎన్టీయార్ డైలాగ్ చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు. ట్విటర్ వేదికగా కౌంటర్, ఎన్కౌంటర్లతో రోజురోజుకూ టాలీవుడ్ వేడెక్కుతోంది. కానీ హీరో నిఖిల్ , నిర్మాత నాగవంశీ…ఇలా ఎవరైనా కావచ్చు వర్మను నేరుగా టచ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది భయమా లేకపోతే వర్మస్థాయికి తాము దిగజారకూడదనే భావనో అర్థం కావడం లేదు.
మొత్తానికి వర్మ పవర్‌స్టార్ సినిమా సంగతేమో గానీ…సినిమాకు మించి బయట రచ్చ సాగుతోంది. వర్మ కోరుకున్నది కూడా ఇదే. అదే జరుగుతోంది.