ఇటీవల తమిళ హీరోయిన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ మూడో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెను వరుస వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలతో విస్తృతస్థాయిలో రచ్చ సాగుతోంది. దీంతో ఆమె ఓ దశలో సంయమనాన్ని కోల్పోయి నోరు జారారు. ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. చివరికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇటీవల పీటర్ పాల్ని వనితా మూడవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో కొందరు దీనిని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో తాను మూడో పెళ్లి చేసుకోవడం సరైందేనని సమర్థించుకునేందుకు వనిత తన స్వస్థలాన్ని తెరపైకి తెచ్చారు.
‘తంజూవూరులో రెండో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఎంతో మంది చేసుకున్నారు. మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొన్ని కారణాలతో నేను మూడో పెళ్లి చేసుకోవలసి వచ్చింది. తంజావూరు సంప్రదాయం ప్రకారమే నేను వివాహం చేసుకున్నా’ అని ఆమె వితండవాదం చేశారు.
వనితా విజయ్‌కుమార్ వ్యాఖ్యలు తంజావూరు గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించాయి. మూడో పెళ్లి చేసుకోవడమే కాకుండా…అది తంజూవూరు సంప్రదాయమని ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా గ్రామస్తులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వనితాపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఒక దశలో భరించలేక తన అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల మరింత డ్యామేజీ జరుగుతుందని భావించిన ఆమె నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తిరిగి తన అకౌంట్‌ని యాక్టివేట్ చేసి క్షమాపణలు చెప్పారామె.
‘నా మాటల వల్ల తంజావూరు ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నట్లయితే వారికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా సోదర సోదరీమణులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఉద్దేశ పూర్వకంగా అన్న మాటలు కాదు. నా మాతృ భూమి అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే వనితా విజయ్‌కుమార్ వ్యాఖ్యలపై జాతీయ పార్టీ లోకల్ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు.