కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో ఆ వైరస్ ను జయించగల శక్తి ఉంటుందని వైద్యులు నిర్ధారిస్తున్నారు. అందుకే కోలుకున్న వ్యక్తుల దగ్గర నుంచి ప్లాస్మాను సేకరించి, కోవిడ్ -19తో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్స చేస్తున్నారు. అది కూడా కరోనా నుంచి కోలుకున్న 28 రోజుల తర్వాత ప్లాస్మా ను డొనేట్ చేయమని వైద్యులు సూచిస్తున్నారు. అప్పటికి వారి రక్తంలో యాంటీబాడీస్ బాగా జనించి ఉంటాయని, దీంతో వారి ప్లాస్మా చికిత్సకు ఎంతో మెరుగ్గా పని చేస్తుందని వివరిస్తున్నారు.
ఈ చికిత్స పద్ధతి ద్వారా ఢిల్లీలో వైద్యులు ఎంతోమందిని సేవ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిపోవడానికి కారణం ప్లాస్మా థెరపీనే అని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే.. ఢిల్లీలో కరోనా యాక్టివ్ పేషెంట్ల సంఖ్య త్వరలోనే జీరో స్థాయికి తగ్గుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఇదే పద్ధతిని ఇతర రాష్ట్రాలు ఎందుకు అనుసరించడం లేదు? అనేది కీలకమైన ప్రశ్న.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్లాస్మాను డొనేట్ చేయమని కరోనా నుంచి కోలుకున్న వారిని వైద్యులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఏపీలో ఇప్పటి వరకూ ప్లాస్మా డొనేషన్ కు ముందుకు వచ్చిన వారు కేవలం పది మంది మాత్రమేనని సమాచారం. ఏపీలో అటు ఇటుగా 40 వేల మంది ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నారు. వీరిలో నెల కిందటే డిశ్చార్జి అయిన వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. అలాంటి వారిలో పది మంది మాత్రమే ప్లాస్మా డొనేషన్ కు ముందుకు వచ్చారట.
కరోనా నుంచి కోలుకున్న వారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, కోలుకున్న నెల తర్వాత కాబట్టి, ఆరోగ్యవంతులయి ఉంటారని, అలాంటి వారు 400 మిల్లీలీటర్ల బ్లడ్ డొనేషన్ కు ముందుకు రావాలని, దాని ద్వారా కొంతమందిని కరోనా బారి నుంచి బయటపడేసిన వారవుతారని వైద్యులు పిలుపునిస్తున్నారు.
ఢిల్లీ విద్యావంతుల శాతం ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంలో అక్కడ అవగాహనతో ప్లాస్మా డొనేషన్ కు చాలా మంది ముందుకు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. నెలన్నర కిందటే అనేక మంది ప్లాస్మా డొనేషన్ కు ముందుకు వచ్చినట్టుగా కథనాలు వచ్చాయి.