కీర్తి సురేష్ అంటే తెలియక పోవచ్చేమోగానీ…మహానటి అంటే మాత్రం గుర్తు పట్టని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాతో ఆ నటి అంతగా ‘కీర్తి’ దక్కించుకున్నారు. కనీసం సినిమాల్లో నటించినందుకు రెమ్యునరేషన్ కూడా అడగదని నిర్మాత కితాబునిస్తున్నారు. అందుకే ఆ మహానటిని సదరు నిర్మాత క్రాక్ పిల్ల అంటూ ఫన్నీగా అంటున్నారు.
మహానటి సావిత్రి గురించి తెలియని ఈ తరం పిల్లలకు…ఆ గొప్ప కళాకారిణి ఎలా ఉంటుందో కీర్తి సురేష్ తన నటనాభినయంతో చూపారు. సావిత్రి బయోపిక్‌ను ‘మహానటి’ పేరుతో తెరకెక్కించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మహానటి తర్వాత మరే టాలీవుడ్ సినిమా ఆ స్థాయిని అందుకోలేదు. మహానటి సినిమాకు స్వప్నా దత్ నిర్మాత.
తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చి పెట్టిన మహానటికి సంబంధించి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ పెడుతూ ఉంటారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కీర్తి సురేష్ పోస్ట్ చేశారు. అలాగే ఓ ఆసక్తికర కామెంట్‌ను కూడా ఫొటోకు జోడించారామె.
‘స్వప్నాదత్ను చూసిన సమయంలో ఎంత ఎగ్జయిట్ అయ్యానో చూడండి. నా చివరి చెల్లింపు వల్ల కలిగిన ఆనందం అయ్యుంటుంది’ అంటూ కామెంట్ పెట్టారు.
కీర్తి పోస్టింగ్‌పై స్వప్నా దత్ స్పందిస్తూ ‘ఈ క్రాక్ పిల్ల తన పారితోషకం కూడా అడగదు’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. అంటే మహానటి సినిమాకు కీర్తి సురేష్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.