రామ్ గోపాల్ వర్మ మరోసారి తన 'ఇమేజ్ ' నిలబెట్టుకున్నాడు. రిలీజ్ కు ముందు చూపించే టీజర్, ట్రయిలర్, సాంగ్స్ లో ఏముంటుందో అంతకుమించి సినిమాలో ఏం ఉండదనే ఇమేజ్ ను నూటికి నూరుపాళ్లు నిలబెట్టుకున్నాడు. తాజాగా అతడు జనాలపైకి వదిలిన పవర్ స్టార్ సినిమాలో కూడా ఇంతకుమించి ఏమీ లేదు. నిజానికి 37 నిమిషాల ఈ స్పూఫ్ ను సినిమా అనడం కూడా తప్పు.
ఇది పొలిటికల్ సెటైర్ కాదు, అలాఅని ఫీచర్ ఫిలిం కూడా కాదు. కేవలం ఓ వ్యక్తిపై ప్రాపగాండ చేసి ఎటెన్షన్ తో పాటు డబ్బులు రాబట్టుకునే ఓ జిమ్మిక్. అంతకుమించి ఈ “పవర్ స్టార్”లో ఏమీ లేదు.
లీగల్ గా తప్పించుకునేందుకు నిజజీవితంలోని వ్యక్తుల పేర్లను కాస్త అటుఇటు మార్చి వర్మ చుట్టేసిన ఈ “పవర్ స్టార్”లో స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోవడానికేం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వెబ్ మూవీలో కథ, స్క్రిప్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వర్మ గత సినిమాల్లానే ఇది కూడా. ఆల్రెడీ రిలీజైన ట్రయిలర్, టీజర్లు, సాంగ్ చూస్తే.. ఈ వెబ్ మూవీని చూడక్కర్లేదు.
పవర్ స్టార్ లో సీన్స్ ఇలా సాగుతాయి…
– ఫలితాల రోజు: ప్రవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ తో టీవీని పగలగొడతాడు
– ఎన్నికల ప్రసంగాలు రాసిన దర్శకుడితో సంభాషణలు, అతడ్ని లాగిపెట్టి ఒకటి కొట్టడం
– ప్రవన్ పెద్దన్నయ్య అతడికి సుద్దులు చెప్పడం, తిరిగి సినిమాల్లోకి రమ్మని సలహా ఇవ్వడం
– కత్తి మహేష్ ప్రవన్ ను ఇంటర్వ్యూ చేయడం
– “గడ్డి తింటావా..” అనే లిరిక్స్ తో వచ్చే సాంగ్
– తన రష్యన్ భార్యతో ప్రవన్ సంభాషణలు
– గుండ్ల రమేష్ ఎపిసోడ్
– ప్రవన్ తో చిన్న అన్నయ్య ఫోన్ సంభాషణ
– చంద్రబాబుతో సమావేశం
– చివర్లో ఆర్జీవీ ఎంట్రీ.. అతడి శైలిలో వికారమైన ఓ చెత్త తాత్విక ప్రవచనం
ఇవే.. కేవలం ఇవే.. ఈ 10 సీన్లతోనే వెబ్ మూవీ తీశాడు వర్మ. ఆల్రెడీ ట్రయిలర్, టీజర్లలో చూసేసిన ఈ సన్నివేశాల మధ్య కనీసం కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ట్రయిలర్ లో చూసిన దానికి కేవలం 2-3 వాక్యాల కొనసాగింపులు మాత్రమే ఉన్నాయి
పొలిటికల్ సెటైరిక్ మూవీ తీశానని వర్మ భ్రమలో ఉన్నాడేమో కానీ, మామూలు న్యూస్ ఛానెల్స్ కూడా ఇంతకంటే మంచి పొలిటికల్ సెటైరిక్ కార్యక్రమాలు చేస్తున్నాయనే విషయాన్ని ఈ దర్శకుడు గ్రహించలేకపోతున్నాడు.
ఇక క్లైమాక్స్ లో వర్మ ఇలా వచ్చి అలా చెప్పే నీతులైతే అర్థం చేసుకున్నోడికి చేసుకున్నంత. “నిజాన్ని వెదుక్కోవడానికి అబద్ధాన్ని ఎప్పుడూ వాడకూడదు, దీనర్థం నాక్కూడా తెలియదంటూ” అయోమయంగా, వెర్రిగా వర్మ చెప్పిన బాగోతం మరో నరకం. ఈ ఏడాదంతా పవన్ కు వ్యతిరేకంగా తను చేసిన ట్వీట్లకు వివరణగా ఆర్జీవీ ఏదో చెప్పాడనిపిస్తుంది. ఆ మాటలన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి.
బాటమ్ లైన్: పవర్ లెస్