సోషల్ మీడియాలో నిత్యం సవాలక్ష వీడియోలు, పోస్టింగ్‌లు వస్తూ ఉంటాయి. వాటిలో మన అంతరంగానికి నచ్చిన వాటిపైనే దృష్టి పెడుతుంటాం. వీడియోలైతే కాసేపు లుక్ వేస్తాం. పోస్టింగ్లైతే చదువుతాం. అవి మన మనసుకు నచ్చితే లైక్ కొడతాం. బాగా నచ్చితే లైక్ కొట్టడంతో పాటు కామెంట్‌తో ప్రోత్సహిస్తాం. సహజంగా సోషల్ మీడియాకు సంబంధించినంత వరకు ఇలా జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడా లైక్…బండ్ల గణేష్‌కు చిక్కులు తెచ్చింది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందన్నట్టు…కేవలం ఒకే ఒక్క లైక్ పవన్‌కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి బండ్ల గణేష్ గురి కావాల్సి వచ్చింది. ఇంతకూ ఏం జరిగిందంటే…
సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన పవర్‌స్టార్ సినిమా ఈ రోజు విడుదలైంది. అంతకు ముందు ఆయన ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం మరో మూడు వీడియోలను వర్మ విడుదల చేశారు. అందులో బ్రదర్స్ వీడియోకు బండ్ల గణేష్ లైక్ కొట్టాడు.
దీన్ని ఓ అభిమాని పసిగట్టి ట్విటర్లో బండ్లను గట్టిగా నిలదీశాడు. `బండ్ల అన్నా…ఈ వీడియోను ఎందుకు లైక్ చేసినవ్` అని ప్రశ్నించాడు. దీంతో పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల కలవరపాటుకు గురయ్యాడు. బండ్ల వెంటనే స్పందిస్తూ … `ఒట్టు.. ఏదో పొరపాటున జరిగింది. నేనెప్పుడూ ఇలా చేయను. జరిగిన దానికి క్షమించండ`ని చెంపలేసుకున్నాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.