వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న ఏఆర్ రెహ్మాన్ కు కూడా బాలీవుడ్ కోపం తెప్పించింది. హిందీ చిత్ర పరిశ్రమలో ఓ వర్గం టాలెంట్ ను తొక్కేస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. రెహ్మాన్ కూడా వాటిపై స్పందించారు. “అవును.. ఓ గ్యాంగ్ నన్ను కూడా తొక్కేసింది” అంటూ సంచలన ప్రకటన చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీతకే అవకాశాలు అందకుండా చేశారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
“ఓసారి ముకేష్ ఛబ్రా నా దగ్గరకు వచ్చారు. ఆయనకు నేను జస్ట్ 2 రోజుల్లో 4 పాటలిచ్చాను. ఆ సందర్భంలో ఆయన నాతో ఓ మాట అన్నారు. రెహ్మాన్ దగ్గరకు వెళ్లొద్దని ఆయనతో కొంతమంది చెప్పారట. నా గురించి ముకేష్ కు కథలు కథలుగా చెప్పారు. తనకు బాలీవుడ్ నుంచి ఎందుకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయో అప్పుడు నాకు అర్థమైంది.”
ప్రస్తుతం బాలీవుడ్ లో తను డార్క్ మూవీస్ మాత్రమే చేస్తున్నానని, పెద్ద సినిమాలు తనకు రాకుండా ఓ గ్యాంగ్ అడ్డుకుంటోందని సంచలన ప్రకటన చేశారు రెహ్మాన్.
“నేను మరిన్ని పాటలు కంపోజ్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ గ్యాంగ్ మాత్రం నన్ను అడ్డుకుంటోంది. నేను విధిని నమ్ముతాను. నా దగ్గరకొచ్చిన సినిమాలు నేను చేస్తున్నాను.”
తనపై వస్తున్న తప్పుడు కథనాలు, కట్టుకథలు నమ్మొద్దంటున్నాడు రెహ్మాన్. ఎవరైనా మంచి ప్రాజెక్టులతో తనను సంప్రదించవచ్చని, బాలీవుడ్ సినిమాలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని చెబుతున్నాడు.