కరోనా నంబర్లు విపరీతంగా పెరిగిపోతున్న వేళ కూడా భారతీయుల్లో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో, కరోనా సోకిన వారు చికిత్స తీసుకోవడానికి కూడా ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, ఆ తీరు వల్ల ఇతరులను ఎంత రిస్క్ లో పెడుతున్నారో తెలుసుకోవడానికి ఈ ఉదంతం చాలు. ఒకరకంగా ఇది అత్యంత భయంకరమైన పరిణామం. కరోనా పాజిటివ్ అని తేలాకా కూడా వైద్య బృందాలకు అందుబాటులోకి లేకుండా పోయి, కొంతమంది మొత్తం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బెంగళూరు వంటి నగరంలో ఇలాంటి పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే!
కరోనా తరహా సింప్టమ్స్ తో టెస్టులకు వచ్చి, ఆ తర్వాత బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకూ ఉందట! వాళ్లందరికీ కరోనా పాజిటివ్ అని తేలిందట. ఆ తర్వాత వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే.. చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు, మరి కొందరు తప్పుడు నంబర్లను ఇచ్చారు, ఇంకొందరు రాంగ్ అడ్రస్ లను నమోదు చేశారు. వీళ్లు టెస్టులకు వచ్చినప్పుడే రాంగ్ నంబర్లు ఇవ్వడం, అడ్రస్ లు తప్పు చెప్పడం వంటి పనులు చేశారని తీరా టెస్టులు పూర్తయ్యాకా తేలిందని బీబీఎంపీ వర్గాలు ప్రకటించడం గమనార్హం!
బెంగళూరులో రోజువారీగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. రోజుకు 1500 స్థాయిలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో సింప్టమ్స్ తో టెస్టులకు వచ్చిన వాళ్లు అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని బీబీఎంపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తేలితే తమను ఎక్కడ ఆసుపత్రికి తీసుకెళ్లిపోతారో, చుట్టుపక్కల వాళ్లు ఎక్కడ వివక్షతో చూస్తారో… అనే భయాలతో వీళ్లు ఇలా చేస్తున్నారని స్పష్టం అవుతోంది. ఏకంగా 11 వేల మంది తప్పుడు నంబర్లను, తప్పుడు అడ్రస్ లను ఇచ్చారంటే మాత్రం విస్మయం కలగకమానదు. కొందరు మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారట. వారిని ఎలా ట్రాక్ చేయాలో అర్థం కావడం లేదంటూ బీబీఎంపీ వర్గాలు ప్రకటించాయి. ఇలాంటి వారు ఇంకెంత మందిని ఇబ్బందుల్లో పెడుతున్నారో, పాజిటివ్ గా తేలి ఇంకెంతమందికి ఆ వైరస్ ను అంటిస్తున్నారనేది మాత్రం ఊహించడానికే భయాందోళనలను రేపే అంశం.