చాలాకాలంగా గాఢమైన ప్రేమికులుగా చలామణి అవుతున్నారు టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమను చాటుకుంటున్నారు. అప్పుడప్పుడు కలిసి కూడా కనిపిస్తూ ఉంటారు. ప్రైవేట్ గా గడిపినప్పుడు ఒకే లోకేషన్ నుంచి వేర్వేరుగా ఫొటోలను షేర్ చేసి.. వీరిద్దరూ తమ ప్రేమ గురించి లీక్ ఇచ్చుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎప్పుడూ వీరు తమ ప్రేమను ధ్రువీకరించలేదు.
తామిద్దరం ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించుకోలేదు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవలి కాలంలో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే.. బ్రేకప్ జరిగిందని. ధ్రువీకరించకుండా ఇన్నాళ్లూ జంటగా గడిపిన వీళ్లు ఇప్పుడు అంతే హడావుడి లేకుండా విడిపోయారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. అందుకు కారణం ఏమిటంటే.. వీరిద్దరూ జంటగా కలిసి కనిపించకపోవడం, సోషల్ మీడియాలో హడావుడి చేయకపోవడమే.
ఇదివరకూ చేసిన హడావుడి ఇప్పుడు చేయకపోవడంతో.. వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో టైగర్ ష్రాప్ గురించి మరో ప్రచారమూ సాగుతోంది. అదేమిటంటే.. ఇతగాడు శ్రద్ధాకపూర్ తో డేటింగ్ మొదలుపెట్టాడనేది.
‘సాహో’ సుందరి, టైగర్ కలిసి ఇదివరకూ ‘బాఘీ’ సినిమాలో నటించారు కూడా. అప్పటి పరిచయం ఇప్పుడు ప్రేమగా మారిందని ఒక ప్రచారం సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో టైగర్ పై శ్రద్ధా స్పందించింది. అతడు తనకు ఇష్టమైన వ్యక్తి అని శ్రద్ధాకపూర్ ప్రకటించింది. మరి ఈ ఇష్టం ప్రేమేనో, కాదో చెప్పలేదామె!