ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి జలకళ విస్తరిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు పుణ్యమా అని రాయలసీమలోని ఆ చివరి వరకూ కృష్ణా జలాలు అందుతున్నాయి. గత ఏడాది భారీగా నీటి లభ్యతతో చిత్తూరు జిల్లా వరకూ హంద్రీనీవా కాలువలు సాగాయి. ఐదు నెలల పాటు కాలువల్లో నీళ్లు ప్రవహించి, రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలాలను పైకి తీసుకురావడంతో పాటు, పదుల సంఖ్యలో చెరువులను నింపింది. ఉమ్మడి ఏపీలోనే అతి పెద్ద చెరువులు హంద్రీనీవా ప్రాజెక్టుతో అనుసంధానం అయ్యాయి. అలాంటి చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి ఇప్పటికే.
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటికే అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురంలో చాలా మండలాలను, అలాగే చిత్తూరు జిల్లా వరకూ సాగే హంద్రీనీవా ప్రాజెక్టు కవర్ చేసింది. అయినా.. సీమకు అందిన నీటి పరిమాణం మాత్రం చాలా తక్కువ. గత ఏడాది కొన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం లోకి వెళ్లిపోగా.. రాయలసీమకు తిప్పి తిప్పి కొడితే 40 టీఎంసీలు తరలించి ఉంటారు. హంద్రీనీవాతో పాటు ముచ్చుమర్రి తదితర ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా తరలించిన పరిమాణం కూడా తక్కువే. హంద్రీనీవా ఏడాది సామర్థ్యం కేవలం 40 టీఎంసీలు మాత్రమే!
ఆ మాత్రం నీటికే రాయలసీమలోని కొంత ప్రాంతం జలకళను సంతరించుకుంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న మరో బృహత్ ప్రాజెక్టు మొత్తం రాయలసీమ రూపురేఖలనే మార్చేలా ఉంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం చుట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద నిర్మించనున్నారు. దీని ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఏకంగా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు!
ఈ డెలివరీ సిస్టమ్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా ఉంటుంది.
కృష్ణా నదికి వరదల సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీల సామర్థ్యంతో నీటి లిఫ్ట్ జరిగితే.. రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ రోజుల వ్యవధిలోనే నిండిపోతాయి. ఈ లిఫ్ట్ కు అనుగుణంగా కాలువల సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి పనులు సాగుతున్నాయిప్పుడు. అవాంతరాలను లెక్క చేయకుండా జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని అడ్డంకులను దాటుకుని వీలైనంత త్వరగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విజయవంతం అయితే.. కృష్ణా జలాలతో రాయలసీమ మరింత సస్యశ్యామలం కానుంది.